Tg Bharat Vs Imtiaz : వైసీపీ మైనార్టీ వర్సెస్ టీడీపీ వైశ్య.. ఏపీ ఓల్డ్‌ కేపిటల్‌ కర్నూలులో గెలుపెవరిది?

రెండు పార్టీలు సామాజిక కోణంలో పకడ్బందీగా పావులు కదుపుతుండటంతో ఎవరి వ్యూహం ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కర్నూలులో గెలుపు ఏ పార్టీకైనా సవాలేనని చెబుతున్నారు.

Tg Bharat Vs Imtiaz

Tg Bharat Vs Imtiaz : సీమ స్వాగతద్వారం… ఎవరికి అగ్రతాంబూళం? మైనార్టీలు, వైశ్యులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు ఒకే వ్యూహంతో బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ మైనార్టీ నేతను పోటీకి పెడితే.. టీడీపీ వైశ్యుల ఓట్లకు గాలం వేస్తోంది. గత రెండు ఎన్నికల్లో విక్టరీ కొట్టిన అధికార పార్టీ… వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని పావులు కదుపుతుంటే…. గత రెండు ఎన్నికల్లో ఓడిన సానుభూతితో మూడోసారి పసుపు జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతోంది సైకిల్‌ పార్టీ.. మరి ఈ రెండు పార్టీ అభ్యర్థుల్లో విజేతగా నిలిచేది ఎవరు? ఏపీ ఓల్డ్‌ కేపిటల్‌ కర్నూలులో పొలిటికల్‌ ట్విస్టులేంటో ఇప్పుడు చూద్దాం….

ఐఏఎస్‌ అధికారితో ఉద్యోగానికి రాజీనామా చేయించి మరీ బరిలోకి..
రాయలసీమ ముఖద్వారం కర్నూలు.. తుంగభద్ర తీరాన ఉన్న ఈ నగరం ఒకప్పటి ఏపీ రాజధాని. ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కర్నూలు జిల్లా నేతల ఆధిపత్యం కొనసాగుతుంటుంది. 1952లో ఏర్పడిన కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు మంచి పట్టుంది. గత రెండు ఎన్నికల్లో అధికార వైసీపీ గెలవగా, నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో కేవలం రెండు సార్లు మాత్రమే కర్నూలులో టీడీపీ జెండా ఎగిరింది. ఇక మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండే కర్నూలులో ఈ సారి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ను బరిలోకి దింపింది అధికార వైసీపీ. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను తప్పించిన వైసీపీ.. ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌తో ఉద్యోగానికి రాజీనామా చేయించి మరీ ప్రజాక్షేత్రంలో పోటీకి నిలిపింది. దీంతో కర్నూలు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక టీడీపీ తరఫున టీజీ భరత్‌ మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

కర్నూలు అసెంబ్లీ రాజకీయం జిల్లా రాజకీయాల్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్నూలు సిటీలో పాగా వేయడం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి పార్టీలు. 1952లో ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదరం సంజీవయ్య విజయం సాధించారు. ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా కాంగ్రెస్‌ పార్టీనే గెలిచింది. 1962లో స్వతంత్ర అభ్యర్థి టీకేఆర్ శర్మ గెలవగా, ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 1983లో తొలిసారి టీడీపీ ఇక్కడ పాగా వేసింది. ఆ ఎన్నికల్లో గెలిచిన రాంభూపాల్ చౌదరి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ 1999 వరకు ఈ సీటును గెలచుకోలేదు టీడీపీ.

రెండోసారీ వైసీపీ ప్రయోగం సక్సెస్..
1999లో తటస్థుల కోటాలో టీజీ వెంకటేశ్‌ను పోటీపెట్టిన టీడీపీ ఆ ఎన్నికల్లో గెలవగా, మళ్లీ ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఇక 2009లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన టీజీ వెంకటేశ్‌ మంత్రిగా పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి గెలిచి 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి. దీంతో గత ఎన్నికల్లో మైనార్టీ నేత హఫీజ్‌ఖాన్‌ను పోటీకి పెట్టింది ఫ్యాన్‌ పార్టీ. ఈ ప్రయోగం సక్సెస్‌ అవడంతో వరుసగా రెండోసారి కర్నూలు కోటను నిలబెట్టుకుంది వైసీపీ. ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి పోటీకి హఫీజ్‌ ఆసక్తి చూపినా.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో విభేదాలు కారణంగా ఆయనను పక్కకు తప్పించారనేది పొలిటికల్‌ టాక్‌.. ఇదే సమయంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ పేరును అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి అటు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, ఇటు మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డికి షాక్‌ ఇచ్చింది వైసీపీ..

Also Read : ఓసీ వర్సెస్‌ బీసీ..! రాజమండ్రిలో వైసీపీ వ్యూహం ఫలిస్తుందా?

ఇంతియాజ్ ను కలవర పెడుతున్న వర్గ విభేదాలు..
ఇక అధిష్టానం అండదండలతో కర్నూలులో అడుగుపెట్టిన వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్‌.. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం జగన్‌ ఆదేశాలతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఐఎఎస్‌ అధికారిగా పనిచేసేందుకు అవకాశం ఉన్నా.. కొన్ని పరిమితులకు లోబడే పనిచేయాల్సి వస్తున్నందున రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు ఇంతియాజ్‌. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కర్నూలులో బలంగా ఉన్న వైసీపీ క్యాడర్‌ దన్నుతో విజయంపై ధీమా కనబరుస్తున్నారు ఇంతియాజ్‌.

రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఇంతియాజ్‌కు పార్టీలోని వర్గ విభేదాలు కలవరం పుట్టిస్తున్నట్లు చెబుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గాలు ఎంతవరకు సహకరిస్తాయనే సంశయంతో ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈసారి ఎలాగైనా గెలుస్తానని టీజీ ధీమా..
ఇక టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న టీజీ భరత్‌ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సుమారు 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన టీజీ భరత్‌ ఈ సారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. టీజీ భరత్‌ తండ్రి మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ గతంలో మంత్రిగా, రెండుసార్లు కర్నూలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెంకటేశ్‌, 2019లో తన కుమారుడు భరత్‌ను బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో చేదు ఫలితం ఎదురైనా.. ఐదేళ్లు ఓపిక పట్టిన భరత్‌.. నిత్యం ప్రజలతో ఉంటూ ఇమేజ్‌ పెంచుకున్నారు. ఈ సారి ఎలాగైనా కర్నూలులో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆ నినాదంతో అధికార పార్టీ అభ్యర్థిని ఇరుకున పెడుతున్న భరత్..
నేను లోకల్‌… అంటూ ప్రచారం చేస్తున్న టీజీ భరత్‌ అధికార పార్టీ అభ్యర్థిని ఇరుకున పెడుతున్నారు. యువకుడిగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇంతియాజ్‌.. తనకు ప్రత్యేకమైన అభివృద్ధి మోడల్‌ ఉందని… ఐఎఎస్‌ అధికారిగా పనిచేసిన తనకు చాన్స్‌ ఇస్తే కర్నూలు రూపురేఖలే మార్చేస్తానంటున్నారు. ఇలా రెండు పార్టీల అభ్యర్థులు శక్తివంచన లేకుండా ప్రచారం చేసుకోవడం, గెలుపుపై ధీమా వ్యక్తం చేయడంతో ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ పెంచేస్తోంది.

వాస్తవానికి కర్నూలులో ముస్లిం ఓట్లు ఎక్కువ. ఆ తర్వాత ఎస్సీలు, వైశ్యులు కూడా గణనీయంగానే ఉన్నారు. రెడ్డి, బలిజ, బోయ సామాజిక వర్గాల ప్రభావం కూడా ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నాయి. ఈ లెక్కల్లోనే వైసీపీ మైనార్టీని… టీడీపీ వైశ్య సామాజిక వర్గం నేతను పోటీలోకి దించాయి. రెండు పార్టీలు సామాజిక కోణంలో పకడ్బందీగా పావులు కదుపుతుండటంతో ఎవరి వ్యూహం ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కర్నూలులో గెలుపు ఏ పార్టీకైనా సవాలేనని చెబుతున్నారు.

Also Read : తొలిసారి వైసీపీ బీసీ ప్రయోగం.. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మైలవరం