Mylavaram Assembly Constituency : తొలిసారి వైసీపీ బీసీ ప్రయోగం.. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మైలవరం

దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి.

Mylavaram Assembly Constituency : తొలిసారి వైసీపీ బీసీ ప్రయోగం.. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మైలవరం

Big Fight in Mylavaram Assembly Constituency

Mylavaram Assembly Constituency : ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడగలవా? దశాబ్దాల రాజకీయ శత్రుత్వాన్ని మరచిపోయి చేతులు కలపడం సాధ్యమా? ఆర్థికంగా బలమైన నేతను సామాజిక బలంతో ఢీకొట్టే వీలుంటుందా? మైలవరం రాజకీయంలో ఏం జరగబోతుంది? ఓ వైపు రాజకీయంగా కాకలు తీరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌.. మరోవైపు బీసీ నేత సర్నాల తిరుపతిరావు.. ఈ ఇద్దరి మధ్యలో మంత్రి జోగి రమేశ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా… ఎవరి రాజకీయం వారిదే… మైలవరంపై పట్టుకోసం చేయని ప్రయత్నాలు లేవు… మరి చివరికి ఏమైంది? వైసీపీ నుంచి కొత్తనేతకు టికెట్‌ ఎలా వచ్చింది. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ఎలా అయ్యారు?

మొదట్లో కమ్యూనిస్టుల, తర్వాత కాంగ్రెస్, అనంతరం టీడీపీ ఆధిపత్యం..
విజయవాడ పార్లమెంటు పరిధిలోని మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్ అత్యంత కీలకమై స్థానం. ఇక్కడి నుంచి హేమహేమీలు ఎందరో ప్రాతినిధ్యం వహించారు. మొదట్లో కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే తర్వాత కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపింది. అనంతరం టీడీపీ వరుసగా గెలుపొందింది. మొత్తం మీద చూస్తే టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఈ నియోజకవర్గంలో ఎక్కువకాలం ఆధిపత్యం చలాయించాయి. కమ్యూనిస్టు పార్టీ నుంచి బి.విశ్వేశ్వరరావు రెండుసార్లు.. కాంగ్రెస్ తరపున కనుమూరి వెంకట్రావు ఐదుసార్లు విజయం సాధించారు. టీడీపీ నేతలు ఎన్‌.సత్యనారాయణ, జేష్ట రమేశ్‌బాబు, వడ్డే శుభనాద్రిశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా వ్యవహరించారు.

అనుకోకుండా కొత్త వారికి టికెట్..
తాజా ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు జరిగాయి. అనుకున్నవారికి టికెట్ దక్కకపోవడం, అనుకోకుండా కొత్త వారికి టికెట్లు ఇవ్వడంతో మైలవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తుంటే, వైసీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు రంగంలో దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మైలవరం నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్.. కొద్దిరోజుల క్రితమే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి టీడీపీ నుంచి టికెట్‌ దక్కించుకున్నారు. వసంత రాజీనామాతో వైసీపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది. బీసీ ఓటు బ్యాంకు టార్గెట్‌గా తిరుపతిరావు యాదవ్‌కు అవకాశమిచ్చింది. దీంతో మైలవరం గడ్డపై గట్టిపోటీ కనిపిస్తోంది.

అనూహ్యంగా టికెట్ కోల్పోయిన దేవినేని..
గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన సీనియర్‌ నేత దేవినేని ఉమాకు అనూహ్యంగా టికెట్‌ దక్కకపోవడం నియోజకవర్గంలో విస్తృత చర్చకు దారితీసింది. 2014 నుంచి 2019 వరకు మైలవరం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పారు. గత ఐదేళ్ల నుంచి నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు పనిచేసిన ఉమా సీటుకు… సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత రూపంలో ఎర్త్‌ పడింది. గత ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే పోటీ జరిగింది. ఇప్పుడు అధికార పార్టీపై అసంతృప్తితో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వసంత.. దేవినేని స్థానంలో టీడీపీ అభ్యర్థి అయ్యారు.
దీంతో నియోజకవర్గ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు పోరాడిన ఎమ్మెల్యేతోనే ఇప్పుడు టీడీపీ శ్రేణులు కలిసి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వసంత కూడా టీడీపీ కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. అటు వైసీపీలోని తన అభిమానుల ఓట్లపైనా గురిపెట్టిన ఎమ్మెల్యే…. వచ్చే ఎన్నికల్లో మైలవరంలో రెండోసారి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థికంగా బలమైన వసంతను ఎలా ఢీకొడతారో?
ఇక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ప్రత్యర్థిగా వైసీపీ సర్నాల తిరుపతిరావును బరిలోకి దింపింది. వాస్తవానికి ఈ సీటు కోసం గత ఐదేళ్లుగా రాష్ట్ర మంత్రి జోగి రమేశ్‌ తీవ్రంగా ప్రయత్నించారు. మంత్రి జోగి సొంత స్థానం కావడం, ఆయనకు నియోజకవర్గంలో భారీ అనుచర గణం ఉండటంతో మైలవరం నుంచి పోటీకి ఉత్సాహం చూపారు. గత ఎన్నికల్లో పార్టీలోకి కొత్తగా వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌ కోసం పెడనకు వెళ్లిన జోగి… మళ్లీ మైలవరం రావాలనే ఆశపడ్డారు. కానీ, అధిష్టానం మాత్రం బీసీ నేతకే అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా బలమైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను సర్నాల తిరుపతిరావు ఎలా ఢీకొడతారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యేతో పోల్చితే తిరుపతిరావు ఆర్థిక బలం అంతంత మాత్రమే… దీంతో పార్టీ అండదండలపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. సీఎం జగన్‌ ఇమేజ్‌… ఐదేళ్ల నుంచి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ఆశపడుతున్నారు తిరుపతిరావు.

కమ్మ సామాజికవర్గాన్ని ఢీకొట్టేందుకు వైసీపీ ప్రయోగం..
మొత్తానికి మైలవరం సమరం హీట్‌ పుట్టిస్తోంది. రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో పోరాడానికి అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 80 వేల ఓట్లు ఉండగా, బీసీలే అధికం… ఈ కోణంలోనే అధికార పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టింది. మరోవైపు నియోజకవర్గ చరిత్రలో కమ్మ సామాజికవర్గం ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ఏ పార్టీ నుంచి అయినా ఆ సామాజికవర్గం వారే ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ, తొలిసారి కమ్మ సామాజికవర్గాన్ని ఢీకొట్టేందుకు బీసీని ప్రయోగించింది వైసీపీ.. ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు ఫలితం ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమేనా?
ఇక టీడీపీలోనూ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇప్పుడు ఒకేపార్టీలో ఉన్నారు. దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి. జూన్‌ 4న ఈ సందేహాలన్నింటికీ సరైన సమాధానం లభించనుంది.

Also Read : ఓసీ వర్సెస్‌ బీసీ..! రాజమండ్రిలో వైసీపీ వ్యూహం ఫలిస్తుందా?