Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు.. దమ్ముంటే.. బీజేపీని అడుగు- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల

చంద్రబాబుకి ఓటు వేస్తే మళ్ళీ చీకటి రోజులు వచ్చినట్టే. ఇప్పుడే ప్రజలకి నరకం చూపిస్తున్నారు. 2019లో అధికారం ఇవ్వలేదని రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు కక్ష పెంచుకున్నారు.

Sajjala Ramakrishna Reddy : ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ల రద్దుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదని సజ్జల ఆరోపించారు. ఇటీవల కూటమి నాయకులు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో బీజేపీ సహకారం లేదన్నారు. రాష్ట్రంలో పెన్షన్ దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చంద్రబాబే కారకుడని మండిపడ్డారు సజ్జల.

తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి అబద్దాల మ్యానిఫెస్టోతో ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. గతంలో చేసిన నాటకం కంటే గొప్ప నాటకం చంద్రబాబు మెదలు పెట్టారని విమర్శించారు. మా మ్యానిఫెస్టోలో అమలు చేయగలిగే వాటిని మాత్రమే హామీలుగా ఇచ్చామని తెలిపారు.

”చంద్రబాబువి సొల్లు హామీలని ప్రజలకి తెలుసు. సూపర్ 6 అని 6 నెలల ముందు నుండే ప్రజలని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేశారు. కోవిడ్ సమయంలో కూడా అభివృద్ధి, సంక్షేమం ఆగలేదు. జగన్ పథకాలు చూసి రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న టీడీపీ డానికి మించి లక్ష కోట్ల పైగా అబద్దాల హామీలు చంద్రబాబు ఇస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందనే చంద్రబాబు అంత సంపద ఎలా తెస్తారో చెప్పలేదు.

గతంలో రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, సున్నా వడ్డీపై అనేక హామీలు ఇచ్చి చివరికి షరతులు పెట్టి కోత కోశారు. 26వేల కోట్ల డ్వాక్రా హామీలు చంద్రబాబు అమలు చేయకపోతే మేము అధికారంలోకి వచ్చాక అమలు చేశాము. చంద్రబాబు హామీలు నమ్మితే కొంపకొల్లేరు అవ్వడమే. పథకాలకి అర్హత ఏంటో ముందే చెప్పే దమ్ము చంద్రబాబుకి లేదు. 2014లో నిరుద్యోగ భృతి అని యువతని మోసం చేశారు. వడపోసి కోటి మంది ఉన్న నిరుద్యోగులకి లక్ష 60వేల మందికి ఇచ్చారు. చంద్రబాబు హామీలలో కనీసం అర్హులు అన్న మాట కూడా ఉండదు. ప్రజలంటే చంద్రబాబుకు బాధ్యత లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకి వస్తారు. చంద్రబాబు 1999 లో 35లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కట్టారు?

పెన్షన్స్ పెంపు దశల వారీగా అని చెప్పాము అలానే చేస్తాము. అవకాశం ఉంటే ముందే పెన్షన్స్ పెంచుతాము. విద్య, వైద్య, వ్యవసాయ రంగం మీద ప్రధాన ఫోకస్ మా పార్టీ పెట్టింది. రైతుల అభివృద్ధి పై అన్ని రకాలగా ఫోకస్ పెట్టాము. సీఎం జగన్ బాధ్యతగా పని చేసే వ్యక్తి. నోటికి వచ్చిన హామీలు ఇచ్చే వ్యక్తి జగన్ కాదు. మేము అధికారంలోకి రాక ముందు పెన్షన్స్ 1000 ఉండేది. ఇప్పుడు 3వేలు ఇస్తున్నాము. వాళ్ళకి టైమ్ కి రాకుండా అడ్డుకున్నారు.

బెన్ఫిట్ పొందిన వాళ్ళు రెండు నెలల్లో వాలంటీర్ లేకపోతె ఓటు వేయకుండా ఉంటారా? కావాలని వ్యవస్థను నాశనం చేయడమే చంద్రబాబు పని. నేరుగా పెన్షన్స్ బ్యాంకు ఖాతాలో వేయండని చెప్పింది వీళ్ళే, ఇప్పుడు వ్యతిరేకత వచ్చే సరికి మమల్ని అంటున్నారు. చంద్రబాబు పని పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది.

చంద్రబాబుకి ఓటు వేస్తే మళ్ళీ చీకటి రోజులు వచ్చినట్టే. ఇప్పుడే ప్రజలకి నరకం చూపిస్తున్నారు. 2019లో అధికారం ఇవ్వలేదని రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టోని అంటరానితనంలా బీజేపీ చూసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. చంద్రబాబు మ్యానిఫెస్టో చూసి బీజేపీ గుండెలు డబుల్ అయినట్టు ఉంది. అందుకే బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకోలేదు. చంద్రబాబు ముంచుతాడని బీజేపీ వాళ్ళకి తెలుసు అందుకే తెలివిగా పక్కకి తప్పుకున్నారు. చంద్రబాబు అవసరం కోసం ఎవరి కాళ్ళు అయినా పట్టుకుంటారు. అవసరం కోసం పవన్ కళ్యాణ్ అనే పాత్రను చంద్రబాబు క్రియేట్ చేసుకున్నారు. బీజేపీ మద్దతూ చంద్రబాబుకి లేదనేది నిజం.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మేము చేయకపోయినా చేసినట్టు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. మ్యానిఫెస్టో అంటే గ్రంథం. చంద్రబాబు దృష్టిలో బూతు పత్రం. వైసీపీ గుండాలు, చట్టాలు రద్దు చేస్తామని ఎవరైనా మ్యానిఫెస్టోలో పెడతారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీనే. పొత్తులో ఉన్నారు కదా బీజేపీని అడగండి. నీతి ఆయోగ్ సూచనలు మేరకు కేంద్రం తెచ్చిన యాక్ట్ ఇది.

మహారాష్ట్రలో ప్రయోగం చేసి దానిని దేశమంతా ఆచరణలోకి బీజేపీ తెస్తోంది. సమస్యల్లో ఉన్న భూములకి ఒక సొల్యూషన్ గా భావించి ఈ యాక్ట్ తెచ్చినట్టు ఉన్నారు. చంద్రబాబు హయాంలో భూ సమస్యలు ఎక్కువగా ఉండేవి. భూ సర్వే జరిగి నిజమైన ఓనర్ షిప్ ఉంటేనే ఈ సమస్యలు తగ్గుతాయి. దాని వలన రాబోయే రోజుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సూచనలు చేసింది.

బీజేపీని అడగకుండా జగన్ పై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అని టీడీపీ, జనసేన మ్యానిఫెస్టోలో ఉంది,. కాబట్టి బీజేపీ తన అభిప్రాయం చెప్పాలి. మైనారిటీల 4శాతం రిజర్వేషన్ ఉండదని బీజేపీ అంటోంది. దాని మీద టీడీపీ వైఖరి ఏంటో ప్రజలకి చెప్పాలి. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలి” అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

Also Read : పెన్షన్ డబ్బు తీసుకునేది ఎలా? ఏపీలో వృద్ధుల తీవ్ర అవస్థలు, చంద్రబాబే కారణం అంటున్న వైసీపీ

ట్రెండింగ్ వార్తలు