×
Ad

8th Pay Commission: గుడ్‌న్యూస్‌.. ఆలోపు భారీగా జీతాల పెంపు.. ఎంతెంత? ఎవరెవరికి ప్రయోజనం?

దీంతో 18 నెలల బకాయిలు రావచ్చని అంచనా. కమిషన్ త్వరగా ఏర్పడి, ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఆమోదిస్తే ఇది సాధ్యమవుతుంది.

8th Pay Commission

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు 8వ కేంద్ర వేతన సంఘం ద్వారా వేతనాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే, దీని అమలుకు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం పట్టవచ్చని జాతీయ మీడియా పేర్కొంది. 8వ వేతన సంఘం అధికారికంగా ఏర్పడిన తర్వాత సిఫారసులు తుది రూపంలోకి దాల్చడానికి ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని అంచనా.

గత వేతన సంఘాల విధానాన్ని అనుసరిస్తే, కేంద్ర ఉద్యోగులకు జీతాల పెంపు 2027 జులైలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఆ సమయానికి సుమారు 18 నెలల బకాయిలు కూడా రావచ్చని అంచనా.

అంచనా సమయం ఏది?

కేంద్ర క్యాబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలోనే ఆమోదం తెలిపింది. అయితే, 8వ వేతన సంఘం ఏర్పాటును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఏర్పడిన వెంటనే ద్రవ్యోల్బణ డేటా, ఆర్థిక పరిస్థితులను పరిశీలించి తుది నివేదిక సమర్పించడానికి 12-18 నెలలు పడవచ్చు. ప్రభుత్వం ఈ సిఫారసులకు 2027 ప్రారంభంలో ఆమోదం తెలిపితే, అవి 2027 జులై నుంచి అమలులోకి రావచ్చు.

18 నెలల బకాయిల విషయం ఏమిటి?
నిపుణులు సూచించినట్లుగా ప్రభుత్వం బకాయిలను 2026 జనవరి నుంచి చెల్లించే అవకాశం ఉంది. వేతన సవరణల అమలు కూడా ఆ తేదీ నుంచే జరుగుతుందని ముందుగా భావించారు. అయితే, ఈ ప్రక్రియ 2027 మధ్యలో ప్రారంభమైతే, 18 నెలల బకాయిలు రావచ్చు. ఇదే పరిస్థితి 7వ వేతన సంఘం విషయంలోనై కనిపించిన విషయం తెలిసిందే.

జీతాలు ఎంత పెరగవచ్చు?
ద్రవ్యోల్బణం, డీఏ రేట్లు, ఆర్థిక స్థితిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఫిట్‌మెంట్ ఫాక్టర్ (మూల వేతనానికి గుణించే సంఖ్య) 2.57 నుంచి సుమారు 3.0-3.2 మధ్యకు పెరగవచ్చు. దీంతో అధిక శాతం మంది కేంద్ర ఉద్యోగులకు 20-25% వరకు జీత పెంపు రావచ్చు.

ఆర్థిక ప్రభావం, ప్రభుత్వ వైఖరి
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా 8వ వేతన సంఘం కూర్పు లేదా సమయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం.. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణను సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా పింఛన్లు, సబ్సిడీల ఖర్చులు పెరగనున్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించనుంది.

ఎవరికి ప్రయోజనం?
ఈ వేతన పెంపు అమలైన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, పింఛన్‌దారులు, స్వయం నియంత్రిత, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది (కేంద్ర మార్గదర్శకాలు అనుసరించే సంస్థలు)కి ప్రయోజనాలు అందుతాయి.

గతంలో ఏమైంది?
7వ వేతన సంఘం 2013లో ఏర్పాటై, 2015లో నివేదిక సమర్పించింది. 2016లో అమలు ప్రారంభమై ఉద్యోగులకు సగటు 23.5% జీత, భత్యాలను పెంచారు. అదే విధంగా 8వ వేతన సంఘం ప్రణాళిక సాగితే, 2027 జూలైలో అమలయ్యే అవకాశం ఉంది. దీంతో 18 నెలల బకాయిలు రావచ్చని అంచనా. సంఘం త్వరగా ఏర్పడి, ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఆమోదిస్తే ఇది సాధ్యమవుతుంది.