9 Karat Gold: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కీలక నిర్ణయం తీసుకుంది. 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. దీంతో హాల్‌మార్కింగ్ గ్రేడ్‌ల జాబితాలో ఉన్న వాటి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ చర్యతో వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. స్వచ్ఛత ప్రమాణాల్లో పారదర్శకత ఉంటుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. 9 క్యారెట్ బంగారాన్ని తప్పనిసరి హాల్‌మార్కింగ్ వర్గాల జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఇది జూలై 2025 నుండి అమల్లోకి వస్తుంది. హాల్ మార్కింగ్ గ్రేడ్‌ల జాబితాలో ప్రస్తుతం ఇవి ఉన్నాయి: 24KF, 24KS, 23K, 22K, 20K, 18K, 14K. ఇప్పుడు 9K కూడా చేరింది.
BIS రెగులేషన్స్ ప్రకారం ఈ అదనపు నిబంధనలను ఆభరణాల వ్యాపారులు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు పాటించాల్సి ఉంటుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ తెలిపింది. “BIS సవరణ నెం 2 ప్రకారం 9 క్యారెట్ల బంగారం (375 ppt) ఇప్పుడు అధికారికంగా తప్పనిసరి హాల్ మార్కింగ్ కింద ఉంది.
ఆభరణాల వ్యాపారులు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలి. గతంలో తప్పనిసరి హాల్‌మార్కింగ్ వ్యవస్థలో చేర్చని 9 క్యారెట్ల బంగారం ఇప్పుడు అదే నియంత్రణ చట్రంలోకి వస్తుంది. ఈ చర్య వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుంది. స్వచ్ఛత ప్రమాణాల్లో పారదర్శకతను నిర్ధారిస్తుంది” అని కౌన్సిల్ అభిప్రాయపడింది.
ఈ చర్యను సెంకో గోల్డ్ లిమిటెడ్ MD CEO సువంకర్ సేన్ స్వాగతించారు. 9 kt హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం చేపట్టిన గొప్ప చొరవగా అభివర్ణించారు. ”9 కేటీ హాల్‌మార్కింగ్ అనేది ప్రభుత్వం చేపట్టిన గొప్ప చొరవ. ఇది వజ్రాలు, బంగారు ఆభరణాలను వినియోగదారులు సులభంగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆధునిక డిజైన్లు 9 కేటీలో వస్తాయి. కంపెనీలు మరిన్ని డిజైన్లు, స్టైల్స్ లను ప్రవేశపెట్టొచ్చు. ఇది భవిష్యత్తులో ఎగుమతులను కూడా పెంచుతుంది” అని సేన్ అభిప్రాయపడ్డారు.