అమెరికా గోల్డ్ రిజర్వులు ఉండే ఫోట్ నాక్స్‌కు వెళ్లి అక్కడి బంగారం నిల్వలను చెక్ చేయాలని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) శాఖ చీఫ్ ఎలాన్ మస్క్ నిర్ణయించారు. ఫోర్ట్ నాక్స్ కెంటకీలో అమెరికా ఆర్మీ పరిధిలో ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక డొనాల్డ్ ట్రంప్ తమ ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు, సర్కారీ వ్యవస్థలో వృథా వ్యయాన్ని కట్టడి చేసేందుకు డోజ్ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి చీఫ్‌గా ఎలాన్ మస్క్ ఉన్నారు.
అమెరికా గోల్డ్ రిజర్వులు మాయమవుతున్నాయని ప్రచారం జరుగుతున్న వేళ డోజ్ దీనిపై దృష్టి పెట్టి, ఫోట్ నాక్స్‌కు వెళ్లి పరిశీలన చేయనుంది. గోల్డ్ మాయమవుతుందన్న ప్రచారం నిజమే అయితే పసిడి విలువలపై ప్రజల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది.
అలాగే, మార్కెట్‌పై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీంతో డోజ్ శాఖ దీనిపై దృష్టి సారించింది. పరిశీలనలో భాగంగా ప్రభుత్వ వ్యయంపై డోజ్ సమీక్ష చేయవచ్చు. అమెరికా తన బంగారు నిల్వలను ఎలా నిర్వహిస్తుందనే విషయాన్ని, అసమర్థతలను డోజ్ పరిశీలిస్తుంది.
Also Read: నిజమైన వారియర్ అంటే ఈమెనే.. బిడ్డను ఎత్తుకుని ఈ తల్లి చేసిన పనికి..
ఆర్థిక లేదా భద్రతా సమస్యలు ఉన్నాయా? బంగారాన్ని ఎలా నిల్వ చేస్తారు? వంటి వాటిని డోజ్ పరిశీలిస్తుంది. జాతీయ ఆర్థిక నిర్వహణలో ఖర్చుల తగ్గింపులకు సంబంధించిన విధాన మార్పుల వంటివాటిపై కూడా డోజ్ పరిశీలన చేయవచ్చు.
ఫోర్ట్ నాక్సస్‌లో నిజంగానే ప్రభుత్వం పేర్కొన్నంత బంగారం ఉందా? అని డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందేహాల మధ్య ఎలాన్ మస్క్, రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ చర్చలు జరిపారని తెలుస్తోంది. అమెరికా గోల్డ్ రిజర్వులలో పారదర్శకత గురించి ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
ఫోర్ట్ నాక్స్ లో 4,580 టన్నుల అమెరికా బంగారం ఉందని నిర్ధారించుకోవడానికి అందులోకి వెళ్లి ఎలాన్ మస్క్ తనిఖీ చేస్తే చాలా బాగుంటుందని ట్రంప్ మద్దతుదారులు అంటున్నారు. అందులోని బంగారం నిల్వలను చివరిసారిగా 50 సంవత్సరాల క్రితం 1974లో పరిశీలించారని చెప్పారు.