Gold Lons
RBI Gold Lone: అత్యవసరంగా డబ్బు అవసరం అయితే.. బంగారం, వెండి వస్తువులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుంటాం. అయితే, బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగం అవుతున్నట్లు, రుణాల మంజూరులో పలు సంస్థలు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణల నేపథ్యంలో రిజర్వు బ్యాంకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Also Read: బంగారం రూ.3 లక్షలు.. ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే..!
బంగారం, వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సొమ్ముతో మనీలాండరింగ్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు పక్కాగా తనిఖీ చేయాలని రిజర్వు బ్యాంకు బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టడానికి తెచ్చిన నగలు వారి సొంతమేనా అనేది తెలుసుకోవాలని, ఇందుకోసం రశీదులు పరిశీలించాలని సూచించింది. రశీదులు లేకుంటే ఆ నగలు తమ సొంతమేనని రాతపూర్వకంగా హామీపత్రం తీసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.
బంగారు ఆభరణాలు కిలో, వెండి ఆభరణాలు పది కిలోల కంటే మించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టకూడదని ఆర్బీఐ సూచించింది. అదికూడా బంగారం నాణేలు, బిస్కెట్లు అయితే 50గ్రాములకు, వెండి అయితే 500 గ్రాములకు మించి తాకట్టుకు బ్యాంకులు స్వీకరించొద్దని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాక.. అనేక బంగారం తాకట్టు రుణాలు ఒకేసారి తీసుకుంటుంటే వాటిని తనిఖీ చేయాలని సూచించింది. అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.
రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణ గ్రహీత అలా చెల్లించకపోతే తాకట్టు సొత్తును వేలం వేయవచ్చు. అయితే, ఆ వేలం ప్రక్రియను రెండుసార్లు నిర్వహించాలి. తొలుత బ్యాంకు ఉన్న జిల్లా పరిధిలో వేలం నిర్వహించాలి. తొలి విడతలో వేలం ప్రక్రియ పూర్తికాకపోతే రెండోసారి ఆన్‌లైన్ విధానంలో లేదా పక్క జిల్లాలోనైనా వేలం నిర్వహించవచ్చునని ఆర్బీఐ నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది.
రుణ బకాయి చెల్లించినా రెండేళ్లలోగా సొత్తును తిరిగి తీసుకెళ్లకపోతే బ్యాంకు పాలకమండలికి వివరించాలి. రుణగ్రహీతలు, వారి వారసులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని సమాచారం పంపాలని ఆర్బీఐ నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది.