అమెరికాలోని ఫోర్ట్ నాక్స్‌లో బంగారం నిల్వలు అధికారులు చెబుతున్నంత మేరకు ఉన్నాయా? DOGE చీఫ్ ఎలన్ మస్క్ ఇటీవల దీనిపై సందేహాలను వ్యక్తం చేయడంతో దీనిపై చర్చ జరిగింది. “బంగారం అక్కడ ఉందా? లేదా? అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అది అమెరికా ప్రజలకు చెందినది!” అని మస్క్.. అమెరికా సెనేటర్ మైక్ లీని ట్యాగ్ చేస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు ఫోర్ట్ నాక్స్‌లో గోల్డ్ నిల్వల గురించి మరింత ఆసక్తిని రేకెత్తించాయి. అంతే కాకుండా, అమెరికా, భారతదేశం తమ బంగారం నిల్వలను ఎక్కడ ఉంచుతున్నాయో, ఎందుకు ఉంచుతున్నాయో అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి.
ఫోర్ట్ నాక్స్
ఫోర్ట్ నాక్స్ అనేది అమెరికాలో బంగారం నిల్వ చేసుకునే ప్రముఖ ప్రదేశం. అదనంగా, వెస్ట్ పాయింట్, డెన్వర్, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ వాల్ట్‌లలో కూడా కొంత బంగారం నిల్వ ఉందని నమ్ముతారు.
ఫోర్ట్ నాక్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 1937లో అక్కడ బంగారం నిల్వ చేయడం ప్రారంభమైంది. ప్రస్తుతం, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఫోర్ట్ నాక్స్‌లో 4573 టన్నుల బంగారం పైగా బంగారం ఉంది. ఇతర దేశాలతో పోల్చితే ఇక్కడే అధికంగా ఉంది.
అమెరికా ప్రభుత్వానికి చెందిన ఇతర విలువైన ఆస్తులు కూడా ఫోర్ట్ నాక్స్‌లో ఉండవచ్చని భావిస్తారు. భద్రతా కారణాల వల్ల, ఇది ప్రజలకు అందుబాటులో ఉండదు అలాగే సందర్శనకు అనుమతించరు.
భారత్‌లోని బంగారు నిల్వలు.. అలాగే ప్రతి సంవత్సరం కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడానికి కారణాల గురించి ఇప్పుడు చూద్దాం..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారం నిల్వలు 2024 డిసెంబర్ చివరిలో 876.18 టన్నులకు చేరుకోగా, దీని విలువ USD 66.2 బిలియన్లుగా ఉంది. ఇది 2023 డిసెంబర్ నాటికి 803.58 టన్నులు. అంటే, 2024 సంవత్సరంలో 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. అలాగే 2017లో బంగారాన్ని కొనడం ప్రారంభించినప్పటి నుంచి ఇది రెండవ అతిపెద్ద వార్షిక కొనుగోలుగా నిలిచింది.
ఆర్‌బీఐ బంగారు నిల్వల్లో ప్రధాన భాగం విదేశీ వాల్టుల్లో నిల్వ చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాంక్‌లో. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తో పాటు, స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, అలాగే అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వంటి వాల్టుల్లో కూడా భారత్ తన బంగారు నిల్వలను ఉంచుతుంది.
భారతదేశం బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి కారణం?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారాన్ని విదేశాలలో నిల్వ చేస్తే వాణిజ్యం, మార్పిడి ఒప్పందాల్లో ఇది కీలకంగా ఉంటుంది. అదే విధంగా ఆదాయాన్ని పొందడానికి కూడా వీలుగా ఉంటుంది. అయితే, రాజకీయ అస్థిరతలు, యుద్ధాలు వంటి పరిస్థితులు విదేశాల్లో ఉన్న ఆస్తుల భద్రతకు ప్రమాదాన్ని పెంచే అవకాశం కూడా ఉంది.
ఇటీవల పశ్చిమ దేశాలు రష్యా ఆస్తులను నిలిపివేసిన నేపథ్యంలో, ఆర్‌బీఐ తన బంగారు నిల్వలలో కొంత భాగాన్ని భారతదేశానికి తరలించే నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం పార్లమెంటుకు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్‌బీఐ బంగారం కొనుగోలు చేయడం వెనుక ప్రధాన కారణం నిల్వల పోర్ట్‌ఫోలియోను సమతుల్యం చేయడం.
ఆర్‌బీఐ 2024లో 72.6 టన్నుల బంగారాన్ని అదనంగా కొనుగోలు చేసింది. ఇది 2023తో పోలిస్తే నాలుగు రెట్లు అధికం. ఈ కొనుగోలుతో ఆర్‌బీఐ పోలాండ్, టర్కీ కేంద్ర బ్యాంకుల తర్వాత 2024లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన బ్యాంకుల జాబితాలో నిలిచింది. ముఖ్యంగా 2024లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా నవంబర్‌లో ఎన్నికైన తర్వాత కరెన్సీ మార్కెట్లో భారీ ఒడుదొడుకులు వచ్చాయి, దీని ప్రభావం బంగారం కొనుగోలుపై కూడా పడింది.