Baba Vanga
Baba Vanga : బంగారం రేటును ఇక పట్టుకోలేమట.. ఇప్పుడు తులం బంగారం ధర ఎంత ఉందనేది కాదు.. వచ్చే ఏడాది గోల్డ్ రేటు పాత రికార్డులను కనీసం 30శాతం తేడాతో బ్రేక్ చేస్తుందట.. ఇందుకు సంబంధించిన టెక్నికల్, ఫండమెంటల్స్ రీజన్స్ కాదు.. ఎప్పుడో వందేళ్ల క్రితమే బాబా వంగా జోస్యం చెప్పారట. ఇంతకీ ఆమె ఏం చెప్పారు.. బంగారం ధరలు వచ్చే ఏడాది ఏ స్థాయిలో పెరగబోతున్నాయి..?
నోస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్‌గా పేరుబడిన బాబా వంగా జోస్యం అంటూ కొన్ని అంశాలు ఇప్పుడు తిరిగి కలకలం రేపుతున్నాయి. 2025లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీపావళి తర్వాత బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినా.. పెరిగిన ధరలతో పోలిస్తే తగ్గిన ధరలు చాలా తక్కువే కావడం గమనార్హం. 2025 ముగిసేందుకు ఇంకా ఎంతో కాలం లేదు. ఈ క్రమంలో 2026లో బంగారం ధరల గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బాబా వంగా చెప్పారంటూ ఓ విషయం తెగ వైరల్ అవుతోంది.
2026లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బాబా వంగా ముందే జోస్యం చెప్పారంటున్నారు. ఇదే ఇప్పుడు అంతర్జాతీయ బంగారం మార్కెట్‌తో పాటు భారతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బాబా వంగా అంచనా ప్రకారం.. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ముప్పును ఎదుర్కొంటుందని, దీని కారణంగా బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉందని
ప్రచారం బయలుదేరింది.
బాబా వంగా 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏదో ఒక రకమైన పెద్ద సంక్షోభం లేదా నగదు సంక్షోభం ఏర్పడుతుందని తన ప్రోఫెసీల్లో చెప్పారట. సాధారణంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో సురక్షితమైన పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతారు. ఈ సంక్షోభం కారణంగా స్టాక్ మార్కెట్, ఇతర సాధారణ పెట్టుబడులు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అలాంటి అనిశ్చితి ఉన్న సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా నిలుస్తుంది. భారీ నష్టాలు తప్పించుకోవడానికి పెట్టుబడిదారులు పసిడిని కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి.. ధరల్లో ఊహించని విధంగా భారీ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది తులం బంగారం ధర పెరిగిన తీరు బెంబేలెత్తిస్తుండగా.. ఇక వచ్చే ఏడాది కూడా ఇది కంటిన్యూ అవుతుందనడం మరింత సంచలనం కలిగించేదే.
ఒకవేళ బాబా వంగా జోస్యం నిజమై ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం తలెత్తితే, భారతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. మార్కెట్ అంచనాల ప్రకారం, బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1.62 లక్షల నుంచి రూ. 1.82 లక్షల వరకు చేరవచ్చని భావిస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో బంగారం గతంలో రూ. 1,32,294 వద్ద రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. MCX గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పటివరకు 72శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం, భవిష్యత్తులోనూ పసిడిపై ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని పెంచుతోంది.
బాబా వంగా అసలు పేరు వెంజేలియా పాండేవా గుష్టిరోవా. ఆమె 1911 జనవరి 31న ఉత్తర మాసిడోనియాలో జన్మించారు. ఆమె పుట్టుకతో అంధురాలు కాదు. 12 ఏళ్ల వయస్సులో భయంకరమైన తుఫానులో చిక్కుకోవడం వల్ల ఆమె కళ్ళు దెబ్బతిని, శాశ్వతంగా దృష్టిని కోల్పోయారు. అప్పటి నుంచి ఆమెకు అతీంద్రియ శక్తులు వచ్చాయని, భవిష్యవాణి చెప్పారంటారు. ఆమె అంచనాలు నిజమవడం మొదలయ్యాక, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 1980ల నాటికి ఆమెను ప్రజలు ‘నాస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్’గా పిలిచే వారు. ఆమె 1996లో 86 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఐతే ఆమె చనిపోయిన తర్వాత ఆమె అంచనాలు కొన్ని నిజం కావడంతో.. ఆమె ప్రతి అంచనాని ఇప్పుడునిశితంగా పరిశీలించడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే తాజాగా బాబా వంగా జోస్యం వైరల్‌గా మారుతోంది.