Bank Employees: త్వరలో బ్యాంకులు వారానికి ఐదు రోజులే పని చేసే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసేలా నిబంధనలు మార్చాలని ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్)కు బ్యాంకు ఉద్యోగుల సంఘం (యూఎఫ్‌బీఈ)’ ప్రతిపాదించింది.
ఈ మేరకు యూఎఫ్‌బీఈ (యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్), ఐబీఏకు ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసినప్పటికీ, ప్రతి రోజూ అదనంగా 50 నిమిషాలు పని చేయాలని సూచించింది. ఈ అంశంపై ప్రస్తుతం యూఎఫ్‌బీఈ, ఐబీఏ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఐబీఏ ఈ అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగరాజన్ తెలిపారు.
ఈ అంశంలో ‘నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, సెక్షన్ 25’ ప్రకారం నిబంధనల్ని కేంద్రం మార్చాలి. అంటే ప్రతి శనివారాన్ని బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించాలి. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు వరుసగా ఒక శనివారం పని చేసి, మరో శనివారం సెలవు తీసుకుంటున్నారు. అంటే రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు తీసుకుంటున్నారు. ఈ ప్రతిపాదన అమల్లోకి రావాలంటే ఆర్బీఐ కూడా దీనికి అంగీకరించాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ప్రతిరోజు బ్యాంకులు ముందుగానే తెరచుకుంటాయి. ఉదయం 09.45 గంటలకు బ్యాంకులు ప్రారంభమై, సాయత్రం 05.30 నిమిషాల వరకు పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్న దీనిపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.