×
Ad

చైనా ఖతర్నాక్ ప్లాన్.. ప్రపంచం మొత్తం EVలను హోరెత్తించి ఇప్పుడు సడన్‌గా..

ఈవీ రంగం అధిక ఉత్పత్తి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో చైనా కీలక నిర్ణయం తీసుకుంది.

China EVs: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో దూసుకుపోతున్న చైనా కీలక నిర్ణయం తీసుకుంది. 2026-2030 కాలానికి సంబంధించిన పంచవర్ష ప్రణాళిక (ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళిక)లో ఎలక్ట్రిక్‌ వాహనాలను వ్యూహాత్మక పరిశ్రమల జాబితా నుంచి తొలగించింది. ఈ రంగం అధిక ఉత్పత్తి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండడమే ఇందుకు కారణం.

చైనాలో ఎలక్ట్రిక్‌, ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌, ఫ్యూయల్‌ సెల్‌ వాహనాలు (న్యూ ఎనర్జీ వాహనాలు-ఎన్ఈవీలు) గతంలో వరుసగా మూడుసార్లు ఐదేళ్ల ప్రణాళికల్లో వ్యూహాత్మక ఉత్పత్తి రంగాల జాబితాలో ఉన్నాయి. దీని ఉద్దేశం పరిశ్రమ పోటీ సామర్థ్యాన్ని పెంచడం. చైనాలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు బిలియన్ల డాలర్ల సబ్సిడీలు ఇచ్చి ఆ దేశాన్ని ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్‌, ఉత్పత్తి శ్రేణిలో అగ్రస్థానానికి చేర్చాయి.

తాజా ప్రణాళికలో వీటికి ప్రాధాన్యం
చైనా ఐదేళ్ల ప్రణాళికలో క్వాంటమ్‌ టెక్నాలజీ, బయో మాన్యుఫ్యాక్చరింగ్‌, హైడ్రోజన్‌ ఎనర్జీ, న్యూక్లియర్‌ ఫ్యూషన్‌ను కొత్త ఆర్థిక వృద్ధి ప్రేరక శక్తులుగా గుర్తించింది. ఎన్ఈవీలను జాబితాలో చేర్చలేదు.

కొనుగోలు పరిమితులను తొలగించి వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం సూచించింది. పూర్తి ఐదేళ్ల ప్రణాళిక 2026 మార్చిలో జరిగే పార్లమెంట్‌ సమావేశంలో విడుదల కానుంది.

చైనా కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఉంది. కానీ ఈవీ రంగం అధిక ఉత్పత్తి సామర్థ్యం, దీర్ఘకాలిక ధరల పోటీతో ఇబ్బందుల్లో ఉంది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కొత్త ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేయడంలో లేదా వాటిలో పెట్టుబడులు పెట్టడంలో తొందరపడకూడదని అన్నారు. కృత్రిమ మేధస్సు, కంప్యూటింగ్‌ పవర్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల వంటి పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం చైనాలోని ప్రతి ప్రావిన్స్‌కి ఉందా? అన్న ప్రశ్నను జిన్‌పింగ్‌ లేవనెత్తారు.

చైనా ఎలక్ట్రిక్‌ వాహన ప్రోత్సాహ కార్యక్రమాన్ని 2009లో ప్రారంభించినప్పటి నుంచి.. హెఫీ, షియాన్‌ వంటి సాంప్రదాయకంగా రవాణా కేంద్రాలుగా గుర్తింపులేని నగరాలు కూడా ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ప్రధాన కేంద్రాలుగా మారాయి.

చైనాకు ఉన్న సాంకేతిక ఆధిపత్య ఆకాంక్షతో పాటు ఈ పురోగతులు దాదాపు ప్రతి ప్రాంతాన్నీ ఈ రంగంలో స్థానం కోసం పోటీపడేలా చేశాయి. దేశీయ మార్కెట్‌ ఇప్పటికే సంతృప్తికర స్థాయికి చేరి, అనేక ఎలక్ట్రిక్‌ వాహన బ్రాండ్లు పోటీ పడుతున్నాయి. ఇదే సమయంలో ద్రవ్యపరమైన ఒత్తిడి, పశ్చిమ దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఎగుమతులపై అనిశ్చితి నెలకొంది. 1953 నుంచి చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రతి ఐదేళ్లకోసారి దేశ ఆర్థిక, పారిశ్రామిక ప్రాధాన్యాన్ని నిర్ణయించేందుకు ఈ ప్రణాళికలను విడుదల చేస్తోంది.