Commercial LPG cylinder price down
LPG gas Prices on 1st January 2024 : కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఓ చిన్న శుభవార్త కూడా తీసుకువచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. ప్రతి నెలా ఒకటో తారీఖున చమురు కంపెనీలు గ్యాస్ ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు చమురు కంపెనీలు తెలిపాయి.
అంతర్జాతీయంగా గ్యాస్, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది ప్రారంభంలోనే ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించింది. వినియోగదారులకు ఇది కొత్త సంవత్సర కానుకగా అందించింది. అయితే.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై మాత్రమే ధర తగ్గగా.. సామాన్యులు ఉపయోగించే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
కాగా.. ఎన్నికల ఏడాది కావడంతో గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావించగా వారికి నిరాశ తప్పలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల సంవత్సరంలో జనవరి 1 నాడు 14కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.120.50 తగ్గిన సంగతి తెలిసిందే.
తాజాగా ఢిల్లీలో19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కేవలం రూ.1.50 తగ్గింది. దీంతో ఇంతకముందు రూ.1757 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1755.50కి లభిస్తోంది. ఇక ముంబైలో 1710 నుంచి రూ.1708.50కి, చెన్నైలో రూ.5 వరకు తగ్గి రూ. 1924కు చేరుకుంది. హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2002 గా ఉంది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..
చాలా కాలంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 2023 ఆగస్టు 30న రూ.200 తగ్గించారు. ప్రస్తుతం ఈ సిలిండర్ల ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50, హైదారాబాద్‌లో రూ. 955 వద్ద కొనసాగుతోంది.