Cooking Oil Prices: వంటనూనె ధరలు పెరుగుతున్నాయ్.. కారణం ఏమిటో తెలుసా?

భారత దేశంలో ప్రజలు వినియోగించే వంటనూనెలో 60శాతానికిపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే.

Cooking Oil

Cooking Oil Prices Are Increas: దేశంలో వంటనూనెల ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో 20 రోజుల క్రితం ధరలతో పోల్చితే ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15శాతం పెరిగాయి. గత మూడేళ్ల క్రితం వంటనూనెల ధరలు భారీగా పెరిగిన విషయం విధితమే. అప్పుడు రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలు కావటంతో వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. సన్ ఫ్లవర్ నూనె లీటర్ ప్యాకెట్ రూ.200కు చేరింది. పామాయిల్ ధరలుసైతం భారీగా పెరిగాయి. కేంద్రం తీసుకున్న చర్యలతో ఏడాది తరువాత ధరలు దిగొచ్చాయి.

భారత దేశంలో ప్రజలు వినియోగించే వంటనూనెలో 60శాతానికిపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. గత సంవత్సరం (నవంబర్ నుంచి తర్వాతి ఏడాది అక్టోబర్ నెల వరకు నూనె సంవత్సరంగా అంతర్జాతీయంగా పేర్కొంటారు) అత్యధికంగా 164.7 లక్షల మెట్రిక్ టన్నుల నూనెను భారత్ దిగుమతి చేసుకుంది. ఇందుకోసం రూ. 1,38,424 కోట్లను వెచ్చించింది.

ఇండోనేషియా, అర్జెంటీనా దేశాలు భారతదేశానికి నూనెను ఎగుమతి చేసే దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మలేషియా నుంచి అధికంగా పామాయిల్ నూనె మన దేశానికి దిగుమతి అవుతుంది. బ్రెజిల్ నుంచి సోయాబీన్, రష్యా నుంచి క్రూడ్ సన్ ప్లవర్ ఆయిల్, యుక్రెయిన్ నుంచి సన్ ప్లవర్ నూనెను భారతదేశం దిగుమతి చేసుకుంటుంది.

ప్రస్తుతం నూనె ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కేంద్రం నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. సన్ ఫ్లవర్, సోయాబీన్ ముడి నూనెలపై దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి 27.5శాతంకు పెంచింది. రిఫైన్డ్ నూనెలపై సుంకాన్ని 13.7శాతం నుంచి 35.7శాతానికి పెంచింది. దీనికితోడు ప్రస్తుతం అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గుదల కూడా వంట నూనె ధరలు పెరుగుదలకు కారణం అవుతుంది. రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో 20రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్ లో రూ. 135 ఉన్న లీటర్ వంటనూనె ధర ప్రస్తుతం రూ.150 దాటింది.