NPCIL క్లారిటీ : కూడంకుళం ప్లాంట్‌పై సైబర్ దాడి నిజమే.. కానీ!

  • Publish Date - October 30, 2019 / 02:17 PM IST

తమిళనాడులో కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై సైబర్ ఎటాక్‌కు సంబంధించి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) క్లారిటీ ఇచ్చింది. తమ ప్లాంట్ పై మాల్ వేర్ ఎటాక్ జరిగిందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై NPCIL ఒక ప్రకటన జారీచేసింది. కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్ (KKNPP)పై సైబర్ దాడి జరిగినమాట వాస్తమేనని స్పష్టం చేసింది. ఎకె నీమా, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ NPCIL దీనికి సంబంధించి ప్రకటనను జారీ చేశారు. 

NPCIL వ్యవస్థలో మాల్ వేర్ ఉన్నట్టు గుర్తించిన విషయం వాస్తమేనని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన CERT-In సెప్టెంబర్ 4,2019న సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్టు తెలిపారు. దీనిపై తక్షణమే DAE నిపుణులతో కలిసి లోతుగా పరిశీలించామని నీమా అన్నారు. అధికారిక కార్యాకలాపాల కోసం వినియోగించే నెట్ వర్క్ లతో ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన యూజర్ PCకి మాత్రమే మాల్ వేర్ ఎటాక్ అయిందని గుర్తించినట్టు తెలిపారు. 

సూక్ష్మ అంతర్గత నెట్ వర్క్ నుంచి ఇది చాలా విడిగా ఉందని చెప్పారు. అప్పటినుంచి నెట్ వర్క్ లను నిరంతరాయంగా మానిటర్ చేస్తూనే ఉన్నామన్నారు. ఒక యూజర్ పీసీ మినహా ప్లాంట్ లోని మిగతా సిస్టమ్స్ కు మాల్ వేర్ ఎఫెక్ట్ కాలేదని నీమా ధ్రువీకరించారు. భారత అతిపెద్ద పవర్ ప్లాంట్ అయిన కూడంకుళం అణువిద్యుత్ పవర్ ప్రాజెక్టుపై సైబర్ దాడి జరిగిందనే ప్రచారంపై పవర్ ప్రాజెక్టు అధికారులు తీవ్రంగా ఖండించారు. ఆ ప్రచారమంతా అవాస్తవమని KKNPP ట్రైనింగ్ సూపరెండెంట్ అండ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్. రామ్‌దాస్ కొట్టిపారేశారు.