Cyclone Michaung Effect : మిగ్‌జామ్‌ తుఫాను ఎఫెక్ట్.. కస్టమర్లను ఆదుకునేందుకు రంగంలోకి కార్ల కంపెనీలు.. ప్రత్యేక సర్వీసులతో సహాయక కార్యక్రమాలు!

Cyclone Michaung : మిగ్‌జామ్‌ తుఫాను వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కార్ల కంపెనీలు తమ వినియోగదారులకు ప్రత్యేక సర్వీసులను అందించడానికి రంగంలోకి దిగాయి.

Cyclone Michaung _ Maruti, Hyundai, Tata, Mahindra, Toyota announce customer support initiatives

Cyclone Michaung Effect : మిగ్‌జామ్‌ తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రమైన తమిళనాడు భారీగా ప్రభావితమైంది. రాష్ట్రాల్లోని పలు నగరాల్లో భారీ వరదలకు దారితీసింది. కుండపోత వర్షం కురియడంతో అనేక కార్లు, కుటుంబాలను ప్రభావితం చేసింది. తుఫాను సమయంలో బలమైన గాలులు, కురిసిన వర్షం కారణంగా విమానాశ్రయాన్ని కూడా వరదలు ముంచెత్తాయి. దాంతో నగరాల్లో విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దేశంలోని నైరుతి తీరం తుఫానుకు లక్ష్యంగా మారింది.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మిగ్‌జామ్‌ తుఫాను కారణంగా భారీగా విధ్వంసం సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్ కార్ల కంపెనీలు తమ వినియోగదారులకు ప్రత్యేక సర్వీసులను అందించడానికి రంగంలోకి దిగాయి. ఇప్పటికే మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్, ఆడి, టీవీఎస్ వంటి కార్ల తయారీదారులు ఈ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత వినియోగదారులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అనేక సహాయ కార్యక్రమాలను ప్రకటించారు.

మారుతీ సుజుకి ఇండియా :
మిగ్‌జామ్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని తమ కస్టమర్లకు ముందు జాగ్రత్త చర్యలతో కూడిన 7లక్షల ఎస్ఎంఎస్ హెచ్చరికలను మారుతి సుజుకి పంపింది. కార్‌మేకర్ తమ డీలర్ భాగస్వాములతో కలిసి వర్క్‌షాప్‌లలో అనేక ఏర్పాట్లు చేసింది. పొరుగు నగరాల నుంచి 46 టో ట్రక్కులను కూడా సమీకరించింది. అంతేకాదు.. 34 మారుతీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వాహనాలను కూడా రంగంలోకి దింపింది. కస్టమర్లకు అవసరమైన వాహనాల విడిభాగాల జాబితాను కూడా పెంచింది, త్వరిత పరిష్కారం కోసం సమీపంలోని నగరాల్లోని తన సర్వీస్ వర్క్‌షాప్‌ల నుంచి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించింది. కస్టమర్లకు వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్, సెటిల్‌మెంట్ కోసం బీమా సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

Read Also : Jio AirFiber Data Booster Plan : జియో ఎయిర్‌ఫైబర్ బూస్టర్ డేటా ప్లాన్ ఇదిగో.. 1000జీబీ డేటా పొందొచ్చు.. ధర ఎంతంటే?

హ్యుందాయ్ మోటార్ ఇండియా :
హ్యుందాయ్ సీఎస్ఆర్ విభాగం, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్, తమిళనాడులో బాధిత కస్టమర్లను ఆదుకోవడానికి రూ. 3 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది. సంస్థ ఆన్‌సైట్ బృందాలు, బాధిత వర్గాలకు ఆహారం, నీరు, ఆశ్రయం, వైద్య సహాయం, ఇతర అవసరమైన వస్తువులతో సహా అత్యవసర సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తోంది.

‘ఈ పరీక్షా సమయాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా తమిళనాడు ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఇలాంటి సమయాల్లో బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు కట్టుబడి ఉన్నాం. వరద ప్రభావిత ప్రాంతాలు, సంఘాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సహాయ నిధికి రూ. 3 కోట్లు తక్షణ సహాయాన్ని అందజేస్తున్నాం’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ ఉన్ సూ కిమ్ పేర్కొన్నారు.

Cyclone Michaung Car customer support (Source : Google Images )

హ్యుందాయ్ ప్రత్యేక ‘రిలీఫ్ టాస్క్ ఫోర్స్’ని కూడా ఏర్పాటు చేసింది. అవసరమైన వారికి సహాయాన్ని అందించడానికి జిల్లా అధికారులతో కలిసి పని చేస్తుంది. ప్రియమైన కస్టమర్ల కోసం తమిళనాడులో వరద ప్రభావిత వినియోగదారులకు సర్వీసు సపోర్టును పెంచామని, కస్టమర్‌లకు సపోర్టు అందించేందుకు ప్రత్యేక అత్యవసర రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ టీమ్‌ను కూడా నియమించామని అన్నారాయన. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ డ్రై రేషన్, టార్పాలిన్, బెడ్‌షీట్లు, చాపలు వంటి రిలీఫ్ కిట్‌లను కూడా అందిస్తుంది. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది.

టాటా మోటార్స్ :
టాటా మోటార్స్ మిగ్‌జామ్‌ తుఫాను కారణంగా ప్రభావితమైన ప్రాంతంలోని వాహనాలకు ప్రామాణిక వారంటీ వ్యవధి, ఎక్స్ టెండెడ్ వారంటీ వ్యవధి, వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ వ్యవధి, ఉచిత సేవా వ్యవధిని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1, 2023 నుంచి డిసెంబర్ 15, 2023 మధ్య గడువు ముగిసే కాంట్రాక్టులకు కూడా ఈ పొడిగింపు వర్తిస్తుంది. డిసెంబర్ 31, 2023 వరకు చెల్లుబాటు అవుతుందని టాటా మోటార్స్ వెల్లడించింది. కంపెనీ ప్రత్యేక అత్యవసర రహదారి సహాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వినియోగదారులకు సపోర్టు అందించేందుకు 24X7 హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు.. ఫ్రీ టోయింగ్ అసిస్టెన్స్ కూడా అందిస్తోంది.

మహీంద్రా అండ్ మహీంద్రా :
మహీంద్రా మిగ్‌జామ్‌ తుఫాను కారణంగా ప్రభావితమైన తమ కస్టమర్లకు కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, నో-కాస్ట్ ఇన్‌స్పెక్షన్, డ్యామేజ్ అసెస్‌మెంట్, ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. మహీంద్రా కస్టమర్లు డిసెంబరు 31, 2023 వరకు ఈ సపోర్టు సర్వీసులను పొందవచ్చు. ఎస్‌యూవీలు మునిగిపోయిన బాధిత కస్టమర్లకు తదుపరి నష్టాన్ని నివారించడానికి కంపెనీ అనేక సూచలను చేస్తోంది.

Cyclone Michaung (Source : Google Images)

టయోటా కిర్లోస్కర్ మోటార్ :
టయోటా తమ డీలర్ భాగస్వాములతో కలిసి బాధిత కస్టమర్లకు తక్షణ సహాయం అందించడానికి ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లతో పాటు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. టయోటా డీలర్ అవుట్‌లెట్‌లు కస్టమర్ల వాహన పికప్, డ్రాప్ సర్వీసులను వారి ఇంటి వద్దకే అందిస్తోంది. అదనంగా, ప్రత్యేకంగా అమర్చిన (Hilux) వాహనాలు, మరమ్మతులు సర్వీసింగ్ కోసం టయోటా డీలర్ అవుట్‌లెట్‌లకు మునిగిపోయిన కార్లను రక్షించడానికి, తరలించడానికి ఉపయోగిస్తోంది.

ఆడి :
మిగ్‌జామ్‌ తుఫాను వరదల కారణంగా ప్రభావితమైన కస్టమర్ కార్లకు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA)ని ప్రకటించింది. కాంప్లిమెంటరీ RSA సర్వీసు చెన్నై నగరం అంతటా 24×7 అందుబాటులో ఉంటుంది.

* రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజీ
* 24 x 7 x 365 కవరేజ్
* భారత్‌లో 100శాతం కవరేజీ
* ఆన్-సైట్ మరమ్మతులు, ఇంధనం, విడిభాగాల పంపిణీ
* ప్రయాణం లేదా వసతి సౌకర్యాలు
* వాహనం కస్టడీ, రవాణా, స్టోరేజీ, వెహికల్ భద్రపరచడం
* ప్రత్యేకంగా రూపొందించిన టోయింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు

టీవీఎస్ :
టీవీఎస్ మోటార్ కంపెనీ (TVSM) తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని వరదల బారిన పడిన జిల్లాల్లోని తన వినియోగదారులకు అదనపు సర్వీసు సపోర్టును ప్రకటించింది. ప్రాధాన్య మరమ్మతులు, ఐసీఈ, ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా రహిత వరద సంబంధిత మరమ్మతుల కోసం ఉచిత లేబర్ సర్వీసులను అందిస్తోంది. డిసెంబర్ 8, 2023 నుంచి డిసెంబర్ 18, 2023 మధ్య సమీపంలోని టీవీఎస్ మోటార్ అధీకృత సర్వీసు సెంటర్‌కు వెళ్లే సౌకర్యాన్ని అందిస్తుంది.

Read Also : Best Phones in India : ఈ డిసెంబర్‌లో రూ.35వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు