Real TDR Projects : హైదరాబాద్‌తో పాటు నగరం చుట్టూ చేపడుతున్న హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులకు పెద్దమొత్తంలో భూములు అవసరం. పార్కులు, చెరువుల అభివృద్ధితో పాటు లింక్ రోడ్లు, రేడియల్ రోడ్ల డెవలప్‌మెంట్, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం హెచ్‌ఎండీఏ భూ సేకరణ చేస్తోంది. ఈ భూసేకరణకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం.
Read Also : Dream Home : తగ్గేదేలే.. సీజన్ ఏదైనా.. హైదరాబాద్‌లో తగ్గని నిర్మాణ పనులు
దీంతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్… టీడీఆర్ అమలు చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్లాన్ చేసింది. అందుకోసం జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసినట్లుగా టీడీఆర్ బ్యాంక్‌ను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేయనుంది. ఎవరికి టీడీఆర్ అవసరం ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకోవడంతో పాటు పారదర్శకంగా క్రయవిక్రయాలు జరిగేలా హెచ్‌ఎండీఏ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల హెచ్‌ఎండీఏకు ఆర్థిక కష్టాలు తగ్గనున్నాయి.
భూ సేకరణ ఖర్చును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం.. టీడీఆర్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. భూసేకరణలో నగదుకు బదులుగా భూమికి భూమిని రెండు లేదా నాలుగు రేట్లు పరిహారంగా ఇవ్వాలనేది టీడీఆర్ ఉద్దేశం. గ్రామ కంఠం భూమికి రెండు రెట్లు.. అంటే వంద గజాల భూమి సేకరిస్తే 200 గజాలు.., అదే పట్టా భూమి అయితే 400 గజాల భూమిని పరిహారంగా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ద్వారా యజమానులు తమ భూమిని గజాల చొప్పున అమ్ముకునేందుకు వీలు ఉంటుంది.
టీడీఆర్ బ్యాంక్ ఏర్పాటు :
అంటే ఒక ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తే అక్కడ మార్కెట్ ధరకు డబ్బులు చెల్లిస్తుంది. కాని టీడీఆర్ విధానం వల్ల రెండు రెట్లు లేదా నాలుగు రెట్ల భూమి పరిహారం సరిఫికెట్ల రూపంలో లభిస్తుంది. అవసరం ఉన్నవారు ఈ సర్టిఫికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ భూముల్లో చేపట్టే నిర్మాణాల్లో అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు.
చట్టప్రకారం నాలుగు అంతస్తులు నిర్మించుకోవడానికి అవకాశముంటే.. టీడీఆర్ వల్ల భూములు పొందితే అదనంగా మరో అంతస్తు నిర్మించుకోవచ్చు. ఒకవేళ ఐదు అంతస్తులకు మించిన నిర్మాణాలైతే మరో 2అంతస్తులను అదనంగా నిర్మించుకోవచ్చు. దీంతో టీడీఆర్‌పై నిర్మాణదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
భూ యజమానులకు అదనపు ప్రయోజనాలు :
జీహెచ్‌ఎంసీలో టీడీఆర్ బ్యాంకును 2019లోనే అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఏటా ఖజానాపై జీహెచ్‌ఎంసీకి దాదాపు 5వేల కోట్ల భారం తగ్గింది. ఇలా జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 10వేల కోట్ల వరకు టీడీఆర్ సరిఫికెట్లను జారీ చేశారు. తాజాగా జీహెచ్‌ఎంసీ బాటలో హెచ్‌ఎండీఏ కూడా టీడీఆర్ బ్యాంక్‌ను అమల్లోకి తీసుకురావడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
అలాగే, హైదరాబాద్ నిర్మాణ రంగం కూడా శరవేగంగా ఎదిగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీఆర్ ద్వారా భూ యజమానులకు అదనపు ప్రయోజనాలు కూడా కలుగనున్నాయి. ఆక్యుపెన్సీ రుసుమును చెల్లించేందుకు కూడా టీడీఆర్‌ను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
Read Also : Dream Home : భవిష్యత్‌కు భరోసా.. సొంతింటి కలపై హైదరాబాద్ వాసుల దృష్టి