Tesla Robotaxi : ఎట్టకేలకు భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది.. బిగ్ హింట్ ఇచ్చిన ఎలన్ మస్క్.. రోబోటాక్సీ లాంచ్ డేట్ రివీల్ చేశాడుగా!

Elon Musk Tesla Robotaxi : భారతీయ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై ఎలన్ మస్క్ బిగ్ హింట్ ఇచ్చాడు. దేశంలో టెస్లా ఫ్యాక్టరీని స్థాపించాలని యోచిస్తున్నాడు. టెస్లా రోబోటాక్సీని ఆవిష్కరించే తేదీని కూడా మస్క్ ప్రకటించాడు.

Elon Musk Tesla Robotaxi : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌కు వస్తుందా? దీనిపై, ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ సైతం మౌనాన్ని వీడాడు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మస్క్ భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను అందించడమే లక్ష్యమని పేర్కొన్నాడు. భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు స్థలం కోసం వెతుకుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్‌లు టెస్లాకు ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ల్యాండ్ ఆఫర్‌లను పొడిగించాయి. ఈ క్రమంలోనే టెస్లా బృందం భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రాంతాలను అన్వేషిస్తోంది. ప్రత్యేకించి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుపై కంపెనీ దృష్టిసారించింది. ఇప్పటికే అనేక కార్ల తయారీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Elon Musk AI : 2029 నాటికి మనుషుల కన్నా ఏఐ చాలా తెలివైనదిగా మారుతుంది : ఎలన్ మస్క్!

విక్రయంతో పాటు కార్ల తయారీ కూడా ఇక్కడే :
ప్రస్తుతం మార్కెట్లో టన్నుల కొద్ది పోటీ కారణంగా ఎక్కువ మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో టెస్లా ఆశించిన స్థాయిలో కార్లను విక్రయించలేదు. కానీ, భారత్ ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ కార్లపై పన్నులు తగ్గించాలని నిర్ణయించుకుంది.

ఇప్పటికే అనేక కార్ల కంపెనీలు అధిక మొత్తంలో పెట్టుబడితో వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో తమ కార్ల తయారీని ప్రారంభించేందుకు అంగీకరిస్తున్నాయి. టెస్లా కొంతకాలంగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కార్లను దేశంలో విక్రయించడమే కాకుండా భారత్‌లోనే కార్లను తయారు చేయాలని భారత ప్రభుత్వం పేర్కొంది.

టెస్లా ఒక ఏడాది నుంచి భారత ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది. గత జూన్‌లో మస్క్ కూడా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. 2023 ఏడాది జూలైలో టెస్లా భారత్‌లో దాదాపు రూ. 17,30,000 ఖరీదు చేసే కారును తయారు చేసే ఫ్యాక్టరీని నిర్మించాలనుకుంటున్నట్లు మస్క్ వెల్లడించారు.

Elon Musk Tesla Robotaxi

భారత్‌లో విక్రయించాలనుకునే ఫ్యాన్సియర్ మోడల్‌లపై తక్కువ పన్నులు విధించాలని కోరారు. టెస్లా భారత్‌లో కార్లను విక్రయించడం ప్రారంభిస్తే.. ఇతర కంపెనీలను కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రోత్సహించవచ్చునని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు.. కార్ల విడిభాగాలను తయారు చేసే భారతీయ కంపెనీలకు చాలా ప్రయోజకరంగా మారనుంది.

వచ్చే ఆగస్టులోనే టెస్లా రోబోటాక్సీ లాంచ్ :
మస్క్ టెస్లా రోబోటాక్సీ లాంచ్ తేదీని కూడా ప్రకటించాడు. టెస్లా రోబోటాక్సీ 8/8 (ఆగస్టు 8, 2024)లో ఆవిష్కృతం అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మస్క్ పోస్టు షేర్ చేశాడు. ఈ ప్రకటన తరువాత మార్కెట్ వాచ్ ప్రకారం.. శుక్రవారం ట్రేడింగ్ సమయంలో టెస్లా స్టాక్ దాదాపు 4 శాతం పెరిగి 171.19 డాలర్లకి చేరుకుంది. ఆటోమోటివ్ పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చగల స్వయంప్రతిపత్త వాహనాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది టెస్లా. అయితే, సరసమైన ధరలో కారును అందించే ప్రణాళికలను కంపెనీ రద్దు చేస్తున్నట్లు వచ్చిన నివేదికలను మస్క్ ఖండించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలుగులోకి వచ్చింది.

రోబో టాక్సీ.. ఫ్యూచర్ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్
2019 ఇన్వెస్టర్ ఈవెంట్ సందర్భంగా మస్క్ వివరించిన టెస్లా రోబోటాక్సీ.. ఫ్యూచర్ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్. రాబోయే రోజుల్లో ఈ రోబోటాక్సీ సర్వీసుల ద్వారా యజమానులు తమ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చునని మస్క్ పేర్కొన్నారు. అయితే, ఈ ట్యాక్సీ సర్వీసులకు టెస్లా కమీషన్ కూడా తీసుకోనుంది.

Read Also : Realme 12x 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ రియల్‌మి 5జీ ఫోన్ ధర కేవలం రూ.12వేల లోపు మాత్రమే!

ట్రెండింగ్ వార్తలు