Elon Musk vs Sam Altman : ఓపెన్ ఏఐని టార్గెట్ చేసిన మస్క్.. సామ్ ఆల్ట్‌మన్‌పై దావా!

Elon Musk : ఎలన్ మస్క్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ కానీ, ఓపెన్ ఏఐ కానీ స్పందించేదు. కాంట్రాక్ట్ ఉల్లంఘన, విశ్వసనీయత పాటించకపోవడంతో వ్యాపార కోణాన్ని తప్పుబడుతూ సామ్ ఆల్ట్ మన్, ఓపెన్ ఏఐపై దావా వేశారు మస్క్.

Elon Musk vs Sam Altman : మరోసారి తన మార్క్ స్ట్రాటజీ చూపించారు ఎలాన్ మస్క్. ఏఐలో తిరుగులేని శక్తిగా ఎదగాలని భావిస్తోన్న ఆయన.. ఓపెన్ ఏఐని టార్గెట్ చేశారు. తనకు సంబంధం లేని సంస్థపై దావా వేసి హాట్ టాపిక్ గా నిలిచారు. చాట్ జీపీటీని రూపొందించింది ఓపెన్ ఏఐ సంస్థ, దాని సీఈవో సామ్ ఆల్ట్ మన్ పై దావా వేశారు మస్క్. కేసులో కీలక విషయాలను ప్రస్తావించారాయన. ఓపెన్‌ఏఐని రూపొందించే సమయంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రోక్‌మన్‌, శామ్‌ ఆల్ట్‌మన్‌.. మానవ ప్రయోజనం కోసం ఏఐ టెక్నాలజీతో చాట్ జీపీటీని డెవలప్ చేస్తున్నామని.. నాన్ ప్రాఫిట్ సంస్థగా మార్చడమే లక్ష్యమని తనకు చెప్పారని వివరించారు మస్క్.

Read Also : Elon Musk Grok AI Chatbot : చాట్‌జీపీటీ, బార్డ్ ఏఐకి పోటీగా ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్.. ఇప్పుడు భారత్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు!

కానీ మైక్రోసాఫ్ట్‌తో కలసి లాభాల కోసం పనిచేసే సంస్థగా మారిందని మండిపడ్డారు. కంపెనీ అసలు లక్ష్యం మానవ ప్రయోజనాల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేయడమైతే.. ఆ కాంట్రాక్టు నిబంధనను ఓపెన్ ఏఐ ఉల్లంఘించిందని ఆరోపించారు. జీపీటీ-4 డిజైన్‌ను పూర్తి రహస్యంగా ఉంచిందన్నారు. 2022 నవంబరులో వచ్చిన చాట్‌జీపీటీ ఆరునెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకుంది.

2015లో ఓపెన్‌ఏఐను శామ్‌ ఆల్టమన్‌ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్‌ కొని దానికి ఎక్స్ అని పేరు పెట్టారు మస్క్. 2018లో ఓపెన్ ఏఐ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి దానిపై లోటుపాట్లు, ఆ కంపెనీ తప్పదాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నారు మస్క్.

కాంట్రాక్ట్ నిబంధన ఉల్లంఘన అంటూ ఆరోపణ :
ఎలన్ మస్క్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ కానీ, ఓపెన్ ఏఐ కానీ స్పందించలేదు. కాంట్రాక్ట్ ఉల్లంఘన, విశ్వసనీయత పాటించకపోవడంతో వ్యాపార కోణాన్ని తప్పుబడుతూ సామ్ ఆల్ట్ మన్, ఓపెన్ ఏఐపై దావా వేశారు మస్క్. మానవ ప్రయోజనాలను మరిచి మైక్రోసాఫ్ట్‌కు లాభాలను పెంచడం కోసం ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తోందనేది మస్క్ ఆరోపణ.

ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ మార్చి 2023లో విడుదల చేశారు. దీని పేరు GPT-4. అయితే ఓపెన్ ఏఐ GPT 3.5 మోడల్‌ వరకు మాత్రమే ప్రీగా వాడడానికి అనుమతి ఉంది. GPT-4 వాడాలంటే నెలకు 20డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని వ్యతిరేకిస్తున్నారు మస్క్. AGI సాధనాల కోసం ఛార్జ్ చేయడం.. ఓపెన్ ఏఐ మూలసూత్రానికి విరుద్ధమంటున్నారు మస్క్. వ్యాపార లాభాల కోసం కాకుండా మానవ ప్రయోజనాల కోసం సాంకేతికతను అందించడానికి చాట్ జీపీటీ తీసుకొచ్చామని వాదిస్తున్నారు.

GPT-4 యొక్క అంతర్గత వివరాలు, ఇతర సమాచారం ఓపెన్ ఏఐకి, మైక్రోసాఫ్ట్ కు మాత్రమే తెలుసు. దాంతో మైక్రోసాఫ్ట్ ప్రజలకు GPT-4ని విక్రయించి లాభాలు పొందాలని చూస్తోందని లాసూట్ లో ప్రస్తావించారు మస్క్. ఓపెన్ఏఐ చాట్ జీపీటీని ప్రజలకు ప్రీగా అందుబాటులో ఉంచితే మైక్రోసాఫ్ట్ వ్యాపార కోణం సాధ్యం కాదని..అందుకే పక్కా ప్లాన్ ప్రకారం తెరవెనక వ్యవహారం నడిపిస్తున్నారని దావా వేశారు.

మైక్రోసాఫ్ట్ జోక్యం పెరిగిందన్న మస్క్ :
సామ్ ఆల్ట్ మన్ ను సీఈవోగా తొలగించి.. మళ్లీ నియమించడం వల్ల.. ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ జోక్యం పెరిగిందని లా సూట్ లో వివరించారు మస్క్. అతనిని తొలగించినప్పుడు బోర్డు సభ్యులు కూడా రిజైన్ చేశారని.. ఇప్పుడున్న బోర్డులో టెక్నాలజీపై పట్టున్నవారు లేరనేది మస్క్ వాదన. ఏఐని వ్యాపారం దిశగా విస్తరించడాన్ని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్ ఏఐపై పోస్టులు పెడుతున్నారు మస్క్.

అసలు ఓపెన్ ఏఐకి, మస్క్ కు ఎక్కడ చెడింది. ఎందుకు మస్క్ ఓపెన్ ఏఐ నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారంటే అదీ వ్యాపారకోణమే. ఓపెన్ ఏఐని టెస్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు మస్క్. ఆయన పెట్టిన ప్రతిపాదనను ఓపెన్ ఏఐలో ఉన్న సామ్ ఆల్ట్ మన్, బోర్డు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.

గూగుల్ కంటే వెనకబడి ఉందని టెస్లాలో ఓపెన్ ఏఐని విలీనం చేయాలని సాకు చూపారు మస్క్. వాస్తవానికి టెస్లా వెహికల్స్ లో ఏఐని వాడాలనే ఉద్దేశంతోనే మస్క్ విలీనం ప్రతిపాదన పెట్టారు. ఇది కాస్త కుదరకపోవడంతో 2018లో ఓపెన్ ఏఐలో చీలిక వచ్చింది. మస్క్ తన పెట్టుబడులను ఉపసంహరించుకుని సొంతంగా..గతేడాదే xAI అనే సంస్థను ప్రారంభించారు. న్యూరాలింక్, ఆప్టిమస్ వంటి కంపెనీల్లో కూడా ఆయనకు భాగస్వామ్యం ఉంది. ఈ రెండు కంపెనీలు ఏఐ అభివృద్ధిపై దృష్టి పెట్టాయి.

Read Also : Elon Musk Xmail : జీమెయిల్‌కు పోటీగా ‘ఎక్స్’మెయిల్ వస్తోంది.. ఎలన్ మస్క్ మళ్లీ వేసేశాడుగా..!

ట్రెండింగ్ వార్తలు