EPFO New Rules
EPFO New Rules : దేశవ్యాప్తంగా 130కి పైగా కంపెనీలతో సభ్యత్వం కలిగి ఉన్న ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ISF), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవలి ఆదేశంపై ఆందోళన వ్యక్తం చేసింది.
దీని ప్రకారం.. ఆగస్టు 1, 2025 నుంచి ఉమాంగ్ యాప్ నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) క్రియేట్ చేసేందుకు ఫేస్ అథెంటికేషన్ అవసరం. ఇప్పుడు UAN UMANG యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT) ద్వారా జారీ అవుతుంది. ఈ కొత్త రూల్ అన్ని కొత్త ఉద్యోగులకు వర్తిస్తుంది.
2 రోజుల్లో 1000కి పైగా ఎంపిక నిలిపివేత :
ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT) రూల్ మార్చడం వల్ల కేవలం 2 రోజుల్లోనే 1,000 మందికి పైగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆగిపోయిందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ చెబుతోంది. జీతాల చెల్లింపుపై ప్రభావితం చేయడమే కాకుండా PF కాంట్రిబ్యూషన్, ఇతర రూల్స్ పాటించడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి.
ఇప్పుడు ప్రతి ఉద్యోగికి KYC అప్‌డేట్ చేయడం చాలా అవసరం. ఇందుకోసం FAT తప్పనిసరి చేసింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే.. చాలా మంది ఉద్యోగులకు స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దీని కారణంగా UAN జనరేట్ చేసేందుకు సమయం పడుతోంది. శాలరీ, పీఎఫ్ కాంట్రిబ్యూషన్ నేరుగా ప్రభావితం అవుతుంది.
ఈ సమస్యలు ముఖ్యంగా MSME, హైటర్నోవర్ రంగాలలో ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ సర్వర్ డౌన్ లేదా కెమెరా లేదా నెట్‌వర్క్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల ఫేస్ ఐడెంటిటీ ఫెయిల్ అవుతుంది. తద్వారా UAN ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఆధార్ లింక్, FAT కోసం జూన్ 30, 2025 వరకు గడువు విధించింది.
సకాలంలో నియమాలను పాటించకపోవడం వల్ల జరిమానా విధించవచ్చు. PF కాంట్రిబ్యూషన్ నిలిపివేయవచ్చు. దాంతో ఉద్యోగి, కంపెనీపై ప్రభావం ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ISF కొన్ని సూచనలు చేసింది.
ISF కొన్ని సూచనలివే :
డిజిటల్ ఆన్‌బోర్డింగ్, FAT అవగాహన కోసం గడువును పొడిగించాలని ISF సూచిస్తోంది. తద్వారా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ, యూఏఎన్, UMANG యాప్ ద్వారా వేగంగా యాక్సస్ చేసుకోవచ్చు. సరైన సపోర్టు, కమ్యూనికేషన్‌తో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT) రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయాలి. అలాగే, PF రిజిస్ట్రేషన్‌లో ఆలస్యం జరగకుండా ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు పోర్టల్ నుంచి UAN క్రియేట్ చేసేందుకు ఎంప్లాయర్లను అనుమతించాలి.
UAN అంటే ఏంటి? :
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను ఈపీఎఫ్ఓ జారీ చేస్తుంది. యూఏఎన్ అనేది 12-అంకెల సంఖ్య. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద అకౌంట్ తెరిచే ప్రతి ఉద్యోగికి అందిస్తారు. ఒకవేళ ఉద్యోగి తన ఉద్యోగాన్ని మారిన తర్వాత కూడా యూఏఎన్ నంబర్ అలాగే ఉంటుంది.