FEMA Authority Approves India's Biggest Seizure Order Against Xiaomi says ED
Xiomi: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ జియోమీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘిన కింద ఆ కంపెనీకి చెందిన 5,551 కోట్ల రూపాయల నిధులను సీజ్ చేసింది. ఈడీ చరిత్రలో ఇంత మొత్తంలో నగదును సీజ్ చేయడం ఇదే తొలిసారి. ఫెమా చట్టం కింద ఈ మొత్తాన్ని ఏప్రిల్ 29నే ఈడీ జప్తుచేసి కాంపిటెంట్ అథారిటీకి ఆమోదం కోసం పంపగా.. తాజాగా అథారిటీ ఆమోదం తెలిపింది. రాయల్టీ పేరుతో విదేశాలకు నిధులు మళ్లించడం ఫెమా నిబంధనల కింద తీవ్రమైన నేరమని ఈడీ పేర్కొంది.
జియోమీ ఇండియా రూ.5,551.27 కోట్ల సొమ్మును అనధికారికంగా భారత్ ఆవలకు ట్రాన్స్‌ఫర్ చేసిందని ఫెమా అథారిటీ పేర్కొంది. రాయల్టీ పైసా చెల్లించకుండానే విదేశాలకు విదేశీ మారక ద్రవ్యం అక్రమ మార్గాల్లో బదిలీ చేయడం ఫెమా నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే. 2014 నుంచి భారత్‌లో స్మార్ట్ ఫోన్ విక్రయాలను ప్రారంభించింది జియోమీ.
జియోమీ గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృ సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని ఆ సంస్థ బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలనూ పొందకుండానే రాయల్టీ పేరుతో ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధమే కాకుండా, బ్యాంకులను తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు చేరవేసిందని ఈడీ పేర్కొంది.