దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా నమోదు కావడంతో ప్రధాన పంటల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక పేర్కొంది. వర్షపాతం తక్కువగా నమోదైన ప్రాంతాల్లో పంట నష్టం కారణంగా ధరలు పెరిగే అవకాశముందని నివేదిక తెలిపింది.
నివేదిక ప్రకారం.. కొన్ని రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది. రాజస్థాన్ లో దీర్ఘకాల సగటు కంటే 118 శాతం అధికంగా, మధ్యప్రదేశ్ లో 57 శాతం, గుజరాత్ లో 48 శాతం, హరియాణాలో 24 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
కర్ణాటక (8 శాతం), పశ్చిమబెంగాల్ (4 శాతం), ఛత్తీస్‌గఢ్ (3 శాతం)లో సాధారణ వర్షపాతం నమోదైంది. “వర్షపాతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండడంతో వాటివల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో పంట నష్టం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది” అని నివేదిక తెలిపింది.
మరోవైపు, బిహార్ (42 శాతం తక్కువ), తెలంగాణ (22 శాతం తక్కువ), ఆంధ్రప్రదేశ్ (15 శాతం తక్కువ), తమిళనాడు (6 శాతం తక్కువ), మహారాష్ట్ర (3 శాతం తక్కువ), పంజాబ్ (2 శాతం తక్కువ), ఉత్తరప్రదేశ్ (2 శాతం తక్కువ)లో తక్కువ వర్షపాతం నమోదైంది.
వర్షపాతం అసమానంగా ఉన్నా కూడా ఖరీఫ్ పంటలకు సంబంధించి విత్తనాలు వేసే ప్రక్రియ మాత్రం సానుకూలంగానే ఉంది. అంటే, సాధారణంగా లక్ష్యం 109.7 మిలియన్ హెక్టార్లు కాగా, ఇప్పటికే 70.8 మిలియన్ హెక్టార్లలో విత్తనాలు వేశారు. గత ఏడాది ఇదే కాలంలో 68.0 మిలియన్ హెక్టార్లు వేశారు. గత వారం 59.8 మిలియన్ హెక్టార్లలో విత్తనాలు చల్లారు.
భారతదేశంలో జూలై 21 నాటికి మొత్తం వర్షపాతం 374 మిల్లీమీటర్లుగా ఉండగా, దీర్ఘకాల సగటుతో పోలిస్తే 6 శాతం అధికంగా ఉంది. గత వారం ఇది 9 శాతం అధికంగా ఉండేది. అయితే, మధ్య, ఈశాన్య భారత్‌లో వర్షపాతం తగ్గడంతో ఇప్పుడు వర్షపాతం తగ్గింది.
ఖరీఫ్ సాగు సమగ్రంగా సాఫీగా కొనసాగుతున్నప్పటికీ, వర్షపాతం అసాధారణంగా ఉన్న ప్రాంతాల్లో పంట ఉత్పత్తిపై ప్రభావం చూపి, త్వరలో ధరలపై పంట దిగుబడుల సరఫరా అంశం ప్రతికూలంగా మారవచ్చని ఐసీఐసీఐ నివేదిక పేర్కొంది.