Budget 2025 : మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.12 లక్షల వరకు నో ఇన్‌కం ట్యాక్స్!

మధ్యతరగతి వారికి భారీ పన్ను ఉపశమనం: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు

Giant Tax Relief For Middle Class

Budget 2025 : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మధ్యతరగతి ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. వేతన జీవుల ఆదాయపు పన్నుపై భారీ ఊరట కలిగించింది. కొత్త పన్ను విధానం ప్రకారం.. రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలసీతారమన్ ప్రకటించారు.

వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ పార్లమెంట్ ముందుకు తెచ్చారు. రూ.12 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని స్పష్టం చేశారు.

అలాగే, ఐటీఆర్, టీడీఎస్ పరిమితి కూడా పెంచారు. ఇందులో టీడీఎస్ పరిమితిని కూడా రూ.10 లక్షలకు పెంచారు. సవరించిన శ్లాబ్ కింద రూ.8 నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10 శాతం ఉంటుంది. పన్ను స్లాబ్‌లకు సవరణలను ప్రకటించగా, కొత్త పన్నువిధానానికి  మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు.

గతంలో రూ. 3 లక్షల వరకు ఉద్యోగుల ఆదాయంపై కనీస పన్ను మినహాయింపు పరిమితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిమితిని రూ. 4 లక్షలకు పెంచింది. రూ.4 లక్షల నుంచి రూ. 8 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను రేట్లు ఉన్నాయి.

కొత్త ఆదాయపన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్స్ ఇవే :

  • 0 నుంచి రూ.4 లక్షల వరకు ట్యాక్స్ లేదు
  • రూ.4 లక్షలు – రూ.8 లక్షల వరకు 5 శాతం
  • రూ.8 లక్షలు – రూ.12 లక్షల వరకు 10 శాతం
  • రూ.12 లక్షలు – రూ.16 లక్షల వరకు 15 శాతం
  • రూ.16 లక్షలు – రూ.20 లక్షల వరకు 20 శాతం
  • రూ.20 లక్షలు – రూ.24 లక్షల వరకు 25 శాతం
  • రూ.24 లక్షల పైన 30 శాతం

రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ​​15 శాతంగా ఉంటుంది. రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ​​20 శాతంగా ఉంటుంది. రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ​​25 శాతంగా ఉంటుంది. రూ.25 లక్షలు, రూ.25 లక్షలకు పైబడి ఉంటే 30 శాతంగా ఉంటుంది.

మధ్యతరగతిపై పన్ను భారం తగ్గింపు :
ఇవన్నీ “మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి” అని నిర్మల సీతారామన్ అన్నారు. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు మిగులుతాయని, ఇది గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుందని ఆమె అన్నారు.

రూ. 12 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను విధించినప్పటికీ, టాక్స్ రిబేట్ లిమిట్ రూ. 12 లక్షలకు పెంచడంతో రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించే అవసరం ఉండదు. రూ. 12 లక్షలపైన ఆదాయం ఉంటే మాత్రమే ఆపై టాక్స్ శ్లాబుల్ని బట్టి టాక్స్ చెల్లించాల్సి వస్తుంది.

మధ్యతరగతి ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలు ఉంటే.. రూ. 12.75 లక్షల వరకు వచ్చే ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. తద్వారా రూ. 12 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి కొత్త పన్ను విధానంలో రూ. 80 వేల వరకు ఆదా అవుతుంది. ప్రస్తుతానికి కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ. 7.75 లక్షల వరకు వచ్చే ఆదాయంపై పన్ను లేదనే చెప్పాలి.