షాకింగ్‌.. లక్ష రూపాయలకు చేరిన 10 గ్రాముల బంగారం ధర 

సుంకాల కారణంగా అమెరికాలో ఆర్థిక వృద్ధి మందగించి, కస్టమర్లపై ధరల భారం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా మీద చైనా.. డ్రాగన్‌ కంట్రీ మీద యూఎస్‌ అదనపు సుంకాలు విధించుకుంటూ పోతుండడంతో అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చుతున్నారు.

దీంతో ఇప్పటికే కమోడిటీ మార్కెట్లో పసిడి రేటు ఔన్సుకు 3,357.40 డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది రూ.2,86,813. అంటే ఒక్క గ్రాము పసిడి ధర రూ.10,117గా ఉంది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.లక్షకు చేరింది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తాకే అవకాశముంది.

Also Read: భూమి నుంచి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో మరో గ్రహం.. అక్కడ జీవరాశి? ఆధారాలు గుర్తించిన భారతీయుడు.. ఎవరీ నిక్కు మధుసూదన్?

సాధారణంగా పసిడి రేటు పెరగడానికి కారణాలు

  • అంతర్జాతీయ మార్కెట్‌ ట్రెండ్‌లు
  • డాలర్ మారకం విలువ
  • ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులు
  • వడ్డీ రేట్లు, ప్రభుత్వ పాలసీలు
  • సీజనల్ డిమాండ్

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాలు విధిస్తుండడంతో వృద్ధి రేటు తగ్గుతుందని ఇటీవలే యూఎస్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ జెరోమ్ పోవెల్ అన్నారు. అలాగే, ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం పెరిగే ముప్పు ఉందని తెలిపారు. ఆయన కామెంట్లతో పసిడి ధరలు మరింత పెరిగాయి.

ఆర్థిక అనిశ్చితి సమయంలో ఇన్వెస్టర్లకు పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా, చైనా సుంకాల మీద సుంకాలు విధించుకుంటూపోతుండడంతో ఆ ఇరు దేశాల మధ్య వాణిజ్యం స్తంభించే అవకాశం ఉందని కూడా అంచనాలు వస్తున్నాయి.

సుంకాల కారణంగా అమెరికాలో ఆర్థిక వృద్ధి మందగించి, కస్టమర్లపై ధరల భారం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చైనా మినహా ప్రపంచ దేశాలపై ట్రంప్ 90 రోజుల పాటు టారిఫ్‌ విరామాన్ని ప్రకటించారు. అయినప్పటికీ అనిశ్చితి ఉండడంతో ప్రపంచ వృద్ధిపై దీని ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.