Outlook 2024: ప్రపంచంలోని అనేక దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు 2024లో మరింత పెరిగే అవకాశం ఉంది. 2023లో ఇప్పటివరకు పసిడి ధర 12 శాతం మేర పెరిగింది. 2022లోనూ బంగారం ధరలు ఒడుదొడుకులకు గురయ్యాయి.
సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ధరలు పెరిగాయి. వచ్చే ఏడాదిలోనూ అంతర్జాతీయంగా ఇదే పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది డిసెంబర్ 30న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ గోల్డ్ 10 గ్రాములకు రూ.54,556గా ఉండగా, ఇవాళ 10 గ్రాముల ధర రూ.62,325గా ఉంది.
బంగారంపై పెట్టుబడి ఎన్నడూ నష్టాన్ని చేకూర్చదు. బంగారం ఒక స్థిరాస్తి. మనం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తే వాటి నుంచి మనల్ని బయట పడేసేందుకు బంగారంపై పెట్టుబడి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత సమయంలో బంగారం కొనవచ్చా? లేదా? అన్న అంశం మీ వ్యక్తిగత పరిస్థితులు, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, వీటిని పక్కనపెట్టి చూస్తే.. ప్రస్తుత సమయంలో బంగారం కొంటే భవిష్యత్తులో ఉపయోగాలే కానీ నష్టాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.