Gold Price
Gold Price Prediction: అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే, ఇటీవల గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం తులం గోల్డ్ రేటు రూ.99వేల వద్ద కొనసాగుతుంది. అయితే, రాబోయే కాలంలో తులం బంగారం ధర రూ.3లక్షలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణాలనుసైతం వారు వెల్లడిస్తున్నారు.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఇవే..
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల అధికారులు జెనీవాలో చర్చలు జరిపారు. మరిన్ని చర్చలు జరిపే నిమిత్తం టారిఫ్ యుద్ధానికి 90రోజుల విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ మేరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇంకా ఆమోదించలేదు. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం క్రమంగా తగ్గించడానికి ఎలాంటి నిబంధనలు, పాటించాల్సిన చర్యలుపై ఇప్పటికీ ఇరు దేశాలు బహిరంగ ప్రకటనలు చేయపోవటంతో మార్కెట్ వర్గాల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాబోయే కాలంలో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా సుంకాలు, కోర్టు తీర్పుల ప్రభావం..
అప్పీళ్ల ప్రక్రియ ముందుకు సాగుతున్నంత వరకు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను అమలు చేయడం కొనసాగించవచ్చునని మంగళవారం ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలు రద్దుచేయకపోతే జులై ప్రారంభం నాటికి అమల్లోకి వస్తాయి. ఇదే జరిగితే.. ధరలు పెరిగే అవకాశం ఉండటంతోపాటు.. పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంవైపు మొగ్గుచూపుతారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.
మే నెలలోనూ వెనక్కు తగ్గని చైనా..
చైనా కేంద్ర బ్యాంకు మే నెలలో (వరుసగా ఏడవ నెలలో) తన బంగారం నిల్వలను మరింత పెంచుకుంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తన హోల్డింగ్‌లను 60,000 ట్రాయ్ ఔన్సులు పెంచింది. దీంతో దాని మొత్తం నిల్వలు 73.83 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరుకున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద కేంద్ర బ్యాంకులలో ఒకటి బంగారం నిల్వలను పెంచుకుంటుండటం రాబోయే కాలంలో బంగారం ధరల పెరుగుదలకు మరింత బలంచేకూర్చుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
3500 డాలర్లకు ఎలా చేరుతుంది..?
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్సు బంగారం 3,371 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటం, చైనా వంటి కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటుండటం వంటి కారణాలను బట్టిచూస్తే బంగారం ధర రాబోయే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో 3500 డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే.. భారతదేశంలో 24క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు సుమారు రూ.3లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.