Gold Rates
Gold Rates : బంగారం ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. భవిష్యత్తులో బంగారం ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. డ్యూష్ బ్యాంక్ అంచనాల ప్రకారం.. 2026లో సెంట్రల్ బ్యాంకుల నుంచి బంగారం డిమాండ్, సరఫరా తగ్గుతున్నందున బంగారం ధరలు ర్యాలీ కొనసాగిస్తాయని భావిస్తున్నారు. బహుశా ఔన్స్‌కు 5వేల డాలర్లు (రూ. 4. 5లక్షలు)కు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది.
అదే జరిగితే బంగారం 10 గ్రాములు రూ.1.35 లక్షల నుంచి రూ. 1.45 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటి అంశాలే ఈ అంచనాకు కారణమని భావిస్తున్నారు. తద్వారా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా నిలిచేలా చేస్తుందని అంటున్నారు.
2025లో రికార్డు స్థాయికి పసిడి :
ఏదిఏమైనా.. సెంట్రల్ బ్యాంకుల నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగినందున 2025లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భవిష్యత్తులో ఈ కొనుగోళ్లు కొనసాగితే బంగారం డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మళ్లించాయి.
ఈ కారణాల వల్ల బంగారం సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యం దెబ్బతిని, డిమాండ్ పెరిగి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంచనాల ప్రకారం.. 2026 నాటికి బంగారం ధరలు ఔన్స్‌కు 5వేల డాలర్ల వరకు చేరుకోవచ్చని డ్యూష్ బ్యాంక్ భావిస్తోంది.
గత అక్టోబర్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారం బలహీనంగానే ఉంది. నవంబర్ 4న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఒత్తిడిని ఎదుర్కొంది. బంగారం గురించి పెట్టుబడిదారులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. గోల్డ్ ర్యాలీ ముగిసిందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే గోల్డ్ ర్యాలీ వెనుక గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తగ్గుతున్న డాలర్ వినియోగం :
ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలలో డాలర్ వాడకం తగ్గుతోంది. డాలర్ డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. జెపి మోర్గాన్ రిపోర్టు ప్రకారం.. ప్రపంచ ఎగుమతులలో అమెరికా వాటా కూడా తగ్గింది. కేంద్ర బ్యాంకుల విదేశీ మారక నిల్వలలో డాలర్ వాటా రెండు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రపంచ వస్తువుల వాణిజ్యంలో డాలర్ వినియోగం భారీగా తగ్గింది.
డిజిటల్ కరెన్సీ వినియోగం :
మోర్గాన్ స్టాన్లీ ప్రకారం.. బంగారం ధరల పెరుగుదల, డిజిటల్ కరెన్సీల వినియోగం పెరుగుతోంది. కేంద్ర బ్యాంకులు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయి. స్టేబుల్‌కాయిన్‌లు ఇతర డిజిటల్ కరెన్సీల వినియోగం పెరుగుతోంది. ప్రపంచ కరెన్సీ మార్కెట్‌లో గణనీయమైన మార్పులు ఉండే పరిస్థితి కనిపిస్తోందని భావిస్తున్నారు. డిజిటల్ కరెన్సీలు డాలర్ ఆధిపత్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తాయి. ఇదే జరిగితే బంగారం ధరలు ఇంకా పెరుగుతూనే ఉండవచ్చు.
ఏఐ విషయంలో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. 1999-2000 నాటి డాట్-కామ్ అంశాన్ని గుర్తుకు తెస్తూ కొన్ని టెక్నాలజీ కంపెనీలు స్టాక్ మార్కెట్ ర్యాలీని నడిపిస్తున్నాయి. బంగారం డిమాండ్‌కు మద్దతుగా బంగారం ఇటిఎఫ్‌లలో పెట్టుబడిదారులు భద్రతను కోరుకుంటున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా బంగారంలో పెట్టుబడిని పెంచాయి.
అమెరికాలో అనిశ్చితి.. :
అమెరికాలో ఆర్థికంగా అనిశ్చితి పెరిగింది. అమెరికా ప్రభుత్వ రుణభారం ద్రవ్యలోటు క్రమంగా పెరుగుతోంది. సుంకాల పెంపు కూడా ఇందుకు మరో కారణం. ఫెడరల్ రిజర్వ్ ముప్పు పొంచి ఉంది. ఈ అంశాలు డాలర్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. రాజకీయ ఒత్తిడితో ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ఫలితంగా డాలర్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది.
బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుందా? :
బంగారం ధరలు తగ్గే పరిస్థితి లేదని, ఇంకా బంగారం పెరగడానికి అవకాశం ఉందని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. డిసెంబర్ 2026 నాటికి బంగారం ఔన్సుకు 4,900 డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. వచ్చే ఏడాది మధ్య నాటికి బంగారం ఔన్సుకు 4,600 డాలర్లకు చేరుకుంటుందని ఎఎన్‌జెడ్ విశ్వసిస్తోంది. డీఎస్పీ మెర్రిల్ లించ్ కూడా బంగారు ర్యాలీ ముగియలేదని విశ్వసిస్తున్నారు.
బంగారం ఇప్పుడే కొనాలా? అమ్మాలా? :
బంగారం ధరలు తగ్గడం, పెట్టుబడి పెట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నారా? డోంట్ వర్రీ.. డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ ప్రకారం.. పెట్టుబడిదారులు బంగారంలో లాభాలను పొందాలంటే ముందుగా ఔన్సుకు 3,860 డాలర్లు నుంచి 4,200 డాలర్ల వరకు విక్రయించవచ్చు. పోర్ట్‌ఫోలియోలో భారీ బంగారం వాటా కలిగిన పెట్టుబడిదారులు లాభాలను పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బంగారాన్ని కొనాలా వద్దా అనే నిర్ణయం మీ ప్రాపర్టీ కేటాయింపుపై ఆధారపడి ఉంటుంది.