Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై బాంబు పేల్చిన కేంద్రం.. ఏకంగా..
Petrol Diesel Price Hike : ఇంధన ధరల పెంపుపై కీలక ప్రకటన వెలువడింది. సమీప భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
government sources said petrol diesel price hike in near future
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కీలక ప్రకటన
- సమీప భవిష్యత్తులో ధరలు పెరిగేందుకు అవకాశం
- లీటర్ మీద రూ.25 నుంచి రూ.28 వరకు
Petrol Diesel Price Hike : ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు (Crude Oil) ధరలు భారీగా పెరిగినప్పటికీ.. దేశంలో మాత్రం గత నాలుగేళ్లుగా రిటైల్ ధరల్లో మార్పు లేకపోవడంతో చమురు సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. అయితే సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మూడు రోజుల క్రితం.. ఎన్నికల తర్వాత ధరలు పెంచే ఆలోచన ఏదీ లేదని చెప్పిన కేంద్రం ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని చెప్పలేమంటూ పరోక్షంగా రేట్లు పెరుగుతాయనే సంకేతాలు పంపుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఈ వారం బ్యారెల్కు 126 డాలర్లకు చేరుకుని.. నాలుగు సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముడి చమురు ధర స్వల్పంగా తగ్గినప్పటికీ.. ఇంకా 110 డాలర్ల పైనే కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడం, శాంతి చర్చలు ఫలించకపోవడంతో.. అమెరికా-ఇరాన్ నేతల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలో నేడు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కనీవిని ఎరగని రీతిలో ఒకేసారి రూ. 993 పెంచారు.
ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనికన్నా ఒక రోజు ముందే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) నుంచి ఒక ప్రకటన వెలువడింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ.. మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గృహ అవసరాల ఎల్పీజీ (LPG) ధరలను ప్రస్తుతానికి పెంచడం లేదని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఏకంగా లీటరుకు రూ. 25 – రూ. 28 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు ముందే అంచనా వేశారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు ప్రారంభించడం.. దానికి బదులుగా ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టడంతో ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
గత వారం ఒక సీనియర్ పెట్రోలియం శాఖ అధికారి మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్లుగా ధరలు స్థిరంగా ఉండటం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు పెట్రోల్ మీద లీటరుకు రూ. 20, డీజిల్ మీద దాదాపు రూ. 100 నష్టం వస్తోందని తెలిపారు. అయినప్పటికీ ధరలు పెంచే ఆలోచన లేదని ఆమె అప్పట్లో చెప్పారు.
పోయిన సంవత్సరం ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్లు కాగా.. ఈ ఏడాది ఈ నెలలో దీని ధర సగటున 114 డాలర్లకు పైగా పెరిగింది. ఇదిలా ఉంటే మన దేశంలో 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.77 కాగా, డీజిల్ ధర రూ. 87.67గా ఉంది.
