Who gets what in Ratan Tata’s will ( Image Source : Google )
Ratan Tata Will : ప్రముఖ దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా అంటేనే సింప్లిసిటీ.. ఎన్నో కోట్ల ఆస్తికి అధిపతిగా అయినా ఒక సాధారణ వ్యక్తిలా జీవించారు. జంతు ప్రేమికుడిగానే కాకుండా మానవతామూర్తిగానూ ఖ్యాతిని సంపాదించారు. రతన్ టాటాకు మూగజీవాల పట్ల ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులోనూ వీధి శునకాల అంటే ఎక్కువగా ఇష్టం. వాటి సంరక్షణ కోసమే ఎన్నో ఆస్పత్రులను కట్టించారు. అయితే, తాజాగా రతన్ టాటా వీలునామాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
86ఏళ్ల రతన్ టాటా ఈ నెల 9న మరణించిన సంగతి తెలిసిందే. అయితే, దాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన టాటా మరణం తర్వాత ఆయన రాసిన వీలునామా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రతన్ టాటా మరణానంతరం రూ. 10వేల కోట్ల సంపద ఎవరికి చెందుతుంది అనేదానిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రతన్ టాటా తన వీలునామాలో ఎవరికి ఎంత ఆస్తిని పంచారు? ఎవరెవరికి ఎంత ఆస్తి చెందుతుంది ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నివేదిక ప్రకారం.. రతన్ టాటా వ్యక్తిగత సంపద దాదాపు రూ. 10వేల కోట్లుగా అంచనా. అయితే, ఆయన రాసిన వీలునామా ప్రకారం.. మొదటగా పెంపుడు జర్మన్ షెపర్డ్ కుక్క ‘టిటో’ కోసం కూడా కొంత వాటాను కేటాయించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ టిటో కుక్క జీవితకాల సంరక్షణ కోసం ఆ వాటాను కేటాయించారని సమాచారం.
అంతేకాదు.. ఈ వీలునామాలో ఆయన చాలాకాలంగా వంటవాడిగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షా, సేవకుడు బట్లర్ సుబ్బయ్యకు ఈ పెంపు కుక్క బాధత్యలను అప్పగించినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. అలాగే, ఆయన సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరిన్, దినా జీజ్‌భోయ్‌లకు కూడా వీలునామాలో కొంత వాటాను కేటాయించారు. మిగిలిన ఆస్తిలో ఎక్కువ భాగం ఆయన సొంత ఫౌండేషన్‌కు కేటాయించారు.
ఆరేళ్ల క్రితమే ‘టిటో’ దత్తత :
రతన్ టాటా తన ఆస్తిలో కొంత వాటాను తన జర్మన్ షెపర్డ్ కుక్క ‘టిటో’ కోసం కేటాయించారు. ‘టిటో’ బతికి ఉన్నంత కాలం ఈ ఆస్తిని దాని సంరక్షణ కోసమే వినియోగించనున్నారు. దాదాపు ఆరేళ్ల క్రితం ఈ కుక్కను టాటా దత్తత తీసుకున్నారు. ఆ క్షణంలోనే మరో పెంపుడు కుక్క కన్ను మూసింది. ఆ కుక్క టిటో పేరునే దీనికి పెట్టారు. పాశ్చాత్య దేశాలలో పెంపుడు జంతువులకు సదుపాయం కల్పించడం సాధారణమే.
అయితే, భారత్‌లో ఇలాంటి సంఘటనలు అసాధారణంగా చెప్పవచ్చు. ఇకపై టిటో కుక్క సంరక్షణ బాధ్యతలను చిరకాల కుక్ రాజన్ షా చూసుకోనున్నారు. రతన్ టాటా వీలునామాలో దాదాపు 30ఏళ్లు తన బట్లర్‌గా పనిచేసిన సుబ్బయ్యకు కూడా వాటాను కల్పించారు. టాటా తన ఇంటి సిబ్బందితో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. రతన్ టాటా విదేశాలకు వెళ్లినప్పుడు, బట్లర్ సుబ్బయ్య కోసం అత్యాధునిక దుస్తులు కొనుగోలు చేసేవారు.
శంతను నాయుడుకి రుణమాఫీ :
రతన్ టాటా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడు గురించి కూడా వీలునామాలో పేర్కొన్నారు. రతన్ టాటాకు చిరకాల సహచరుడు శంతనునాయుడు స్టార్టప్ ‘గుడ్‌ఫెలోస్’లో రతన్ టాటా వాటా ఇప్పుడు లిక్విడ్ అయింది. అంతేకాదు.. శంతను నాయుడు విదేశాల్లో చదువు కోసం ఇచ్చిన రుణాన్ని కూడా రతన్ టాటా మాఫీ చేశారు.
ఇది కాకుండా, రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం టాటా సన్స్, టాటా గ్రూప్ వివిధ కంపెనీలలో ఆయన వాటా ఇప్పుడు టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ అవుతుంది. ఈ ఫౌండేషన్ లాభాపేక్షలేని పనులకు నిధులను అందిస్తుంది. ఇదిమాత్రమే కాదు.. రతన్ టాటా తన వ్యక్తిగత హోదాలో స్టార్టప్‌లలో చేసిన పెట్టుబడులను లిక్విడేట్ చేసి డబ్బును ఈ ఫౌండేషన్‌కు బదిలీ చేస్తారు.
టాటా ఇల్లు, కార్లు ఎవరికి సొంతం? :
రతన్ టాటా చివరి రోజుల్లో నివసించిన కొలాబాలోని హలేకై ఇల్లు, టాటా సన్స్‌కు చెందిన ఎవార్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ యాజమాన్యంలో ఉంది. ఎవార్ట్ భవిష్యత్తు గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టాటా అదనంగా అలీబాగ్‌లో 2వేల చదరపు అడుగుల బీచ్ బంగ్లాను కలిగి ఉంది. దీని భవిష్యత్తు ఇంకా తెలియదు. ముంబైలోని జుహు తారా రోడ్‌లోని రెండు అంతస్తుల ఇల్లు రతన్ టాటా, ఆయన సోదరుడు జిమ్మీ, సవతి సోదరుడు నోయెల్ టాటా, సవతి తల్లి సిమోన్ టాటా, ఆయన తండ్రి నావల్ టాటా మరణం తర్వాత వారసత్వంగా పొందారు.
నివేదికల ప్రకారం.. 20 సంవత్సరాలకు పైగా ఇల్లు ఖాళీగా ఉంది. దీన్ని కూడా విక్రయించే ప్రణాళికలు ఉన్నాయి. టాటా తన కొలోబా నివాసం, తాజ్ వెల్లింగ్టన్ మ్యూస్ అపార్ట్‌మెంట్‌లో ఉంచిన ఖరీదైన మోడల్‌లతో సహా 20 నుంచి 30 కార్లను కూడా వేలంలో విక్రయించవచ్చు లేదా పూణేలోని మ్యూజియం కోసం టాటా గ్రూప్ కొనుగోలు చేయవచ్చు.
రతన్ టాటా అంతిమ కోరికలను నెరవేర్చేది ఎవరంటే? :
రతన్ టాటా అంతిమ కోరికలను నెరవేర్చేందుకు ఆయన సవతి సోదరీమణులు షిరీన్, డీన్నా జెజీబోయ్‌లతో పాటు న్యాయవాది డారియస్ ఖంబటా, దీర్ఘకాల సహచరుడు మెహ్లీ మిస్త్రీని కార్యనిర్వాహకులుగా నియమించారు. మెహ్లీ మిస్త్రీ, సైరస్‌కు సోదరుడు.. రతన్ టాటాకు నమ్మకస్థుడు కూడా. రెండు ప్రధాన టాటా స్వచ్ఛంద సంస్థల బోర్డులలో ట్రస్టీగా ఉన్నారు. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, టాటా సన్స్‌లో 52శాతం వాటా కలిగి ఉన్నారు.
టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌ల ఉమ్మడి హోల్డింగ్స్ మొత్తం 66శాతంగా ఉంది. డిసెంబర్ 28, 1937న జన్మించిన రతన్ టాటా అక్టోబరు 9న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో మరణించారు. టాటా గ్రూప్ 1991లో 5.7 బిలియన్ డాలర్ల నుంచి 2012 నాటికి దాదాపు 100 బిలియన్ డాలర్లకు విస్తరించడంలో టాటా కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో 1991 నుంచి 2012 వరకు చైర్‌పర్సన్‌గా, 2016లో కొంతకాలం తాత్కాలిక చైర్‌పర్సన్‌గా పనిచేశారు.