Hyderabad records 17 percent rise property registrations in August
Hyderabad property registrations: ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం, గృహ రుణాల వడ్డీరేట్లలో పెరుగుదలతో దేశీయ రియాల్టీ రంగం (Real Estate Market) ఇటీవలి కాలంలో కాస్త నెమ్మదించింది. గత కొన్ని నెలలుగా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నిర్మాణరంగంలో స్పీడ్ తగ్గింది. గతంతో పోలిస్తే ఇళ్ల అమ్మకాల్లో జోరు తగ్గింది. అయితే హైదరాబాద్ (Hyderabad) విషయానికి వచ్చే సరికి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం తగ్గేదేలే అంటోంది. అందులోనూ నిర్మాణరంగంలో హైదరాబాద్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. అందుకు అనుగుణంగా ఇళ్ల అమ్మకాల్లో (House Sales) గ్రేటర్ సిటీ స్పష్టమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్ రియాల్టీ రంగం రికార్డులు సృష్టిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ హౌజెస్‌కు చక్కని డిమాండ్ ఉంది. జూలై, ఆగస్టులో నమోదైన సేల్స్ దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఆగస్టులో 17 శాతం వృద్ధితో 6 వేల 493 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. అంతకు ముందు నెల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 5 వేల 557గా ఉన్నాయని తెలిపింది. ఇక ఈ ఆగస్టులో ఇళ్ల అమ్మకాల విలువ 3 వేల 461 కోట్ల రూపాయలుగా నమోదైంది.
మరోవైపు తక్కువ విస్తీర్ణం గల ఇళ్లపై హైదరాబాద్‌వాసులు ఆసక్తి చూపడం లేదు. 500 ఎస్‌ఎఫ్‌టీలోపు కొనేవారు 3 శాతంగా ఉండగా, 500 నుంచి వెయ్యి ఎస్‌ఎఫ్‌టీ లోపు ఇళ్లకు 18 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. ఇక మెజార్టీ హైదరాబాదీలు వెయ్యి నుంచి 2 వేల ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల ఇళ్లకు జై కొడుతున్నారు. ఈ సైజు ఇళ్ల మార్కెట్ వాటా హైదరాబాద్‌లో 67 శాతంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
Also Read: 43 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్ లో సగటు ఇంటి ధర చదరపు అడుగుకు ఎంతంటే?
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో 2 వేల నుంచి 3వేల లోపు ఎస్‌ఎఫ్‌టీ ఉన్న ప్రాపర్టీల కొనుగోలు వాటా క్రమంగా పెరుగుతోంది. ఆగస్టులో మొత్తం ఇళ్ల రిజిస్ట్రేషన్లలో 25 లక్షల నుంచి 50 లక్షల రూపాయల ధరల శ్రేణిలో ఇళ్ల సేల్స్ 52శాతంగా ఉన్నాయి. 50 లక్షల నుంచి 75 లక్షల ధరల శ్రేణిలోని ఇళ్లు 16 శాతం, 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధరల స్థాయి గృహాలు 8 శాతంగా ఉన్నాయి. కోటి నుంచి రెండు కోట్ల రూపాయల మధ్య రిజిస్ట్రేషన్ ఇళ్ల వాటా 7 శాతం ఉండగా, రెండు కోట్లపైన ఇళ్ల వాటా 2 శాతంతో స్థిరంగా కొనసాగుతోంది. భాగ్యనగరంలోని ఇళ్ల అమ్మకాల్లో ఎక్కువగా అపార్ట్ మెంట్స్ వాటా ఉందని, లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారని నైట్‌ఫ్రాంక్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి.
Also Read: రియల్ ఫ్యూచర్.. 2030 నాటికి ఊహకందని రేంజ్ కి రియల్ ఎస్టేట్ మార్కెట్!