Real Warehousing Sector : జీహెచ్‌ఎంసీ పరిధిలో గిడ్డంగులకు పెరుగుతోన్న డిమాండ్‌

Real Warehousing Sector : ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు సంస్థలు తమ కస్టమర్స్‌కు మరింత మెరుగైన సేవలను అందించేందుకు హైదరాబాద్‌లో పెద్దపెద్ద గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి.

Hyderabad warehousing sector sees good demand in GHMC Areas

Real Warehousing Sector : దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. ప్రపంచ స్థాయి రోడ్‌ అండ్‌ రైల్‌ నెట్‌వర్క్‌తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండటంతో హైదరాబాద్‌కు ప్లస్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. దీంతో మన విశ్వనగరం అన్ని రంగాల్లోనూ తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. రాష్ట్ర కంపెనీలే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు… హైదరాబాద్‌పై ఫోకస్‌ పెట్టి ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.

ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు సంస్థలు తమ కస్టమర్స్‌కు మరింత మెరుగైన సేవలను అందించేందుకు హైదరాబాద్‌లో పెద్దపెద్ద గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్డర్‌ చేయడమే ఆలస్యం… వీలైతే అదే రోజూ లేదా తర్వాతి రోజు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. ఇవే కాకుండా పలు పారిశ్రామిక ఉత్పత్తుల డీలర్లు సైతం హైదరాబాద్ నుంచి హోల్ సేల్ అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో ప్రస్తుతం విశ్వనగరంలో వేర్‌హౌజింగ్‌కు చక్కని డిమాండ్‌ ఏర్పడింది.

Read Also : Home Construction : ఇలా చేస్తే.. ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గించుకోవచ్చు..!

మేడ్చల్‌, పటాన్‌చెరు, శంషాబాద్‌ ఏరియాల్లో :
హైదరాబాద్‌కు అన్ని వైపుల ఆయా సంస్థలు తమ గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో గిడ్డంగుల స్థలాలకు ప్రస్తుతం డిమాండ్‌ మరింత పెరిగింది. శంషాబాద్‌, మేడ్చల్‌, పటాన్‌చెరు ప్రాంతాల్లో అధికంగా వేర్‌హౌజింగ్‌ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ షాపింగ్‌ పెరగడంతో గిడ్డంగులకు డిమాండ్‌ నెలకొంది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలు కూడా పెరగడంతో లాజిస్టిక్‌ పార్కులకు చక్కని డిమాండ్‌ ఉంది. వీటిని ఈ-కామర్స్‌ సంస్థలతో పాటు పలు పారిశ్రామిక సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి.

వీటితోపాటు హెచ్ఎండీఏ సైతం రెండు భారీ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాలను పీపీపీ పద్ధతిలో చేపట్టింది. సాగర్‌ హైవేపై ఉన్న మంగళ్లపల్లి వద్ద ఒకటి, అలాగే విజయవాడ హైవేలోని బాటసింగారం వద్ద మరో లాజిస్టిక్‌ పార్కును హెచ్‌ఎండీఏ డెవలప్‌ చేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో గిడ్డంగుల లీజులో హైదరాబాద్‌ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో 27 లక్షల ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం లీజింగ్‌ జరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది.

గిడ్డంకుల డిమాండ్‌తో రియాల్టీ రంగంలో జోష్‌ :
వేర్ హౌజింగ్‌కు హైదరాబాద్‌లో ప్రస్తుతం భారీ డిమాండ్‌ నెలకొంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నెలకు ఎస్‌ఎఫ్‌టీ 18 నుంచి 25 రూపాయల వరకు అద్దెను వసూలు చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అద్దె మరింత ఎక్కువగా ఉంది. ఇక బి-గ్రేడ్‌ గిడ్డంగులకు ఎస్‌ఎఫ్‌టీ అద్దె 15 నుంచి 17 రూపాయలుగా ఉంది.

ఇలా ఈ-కామర్స్‌కు ఉన్న డిమాండ్ కారణంగా విస్తరిస్తున్న వేర్‌హౌజింగ్‌… ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరగడానికి ఊతం ఇస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు త్వరలో పట్టాలెక్కనున్న రీజనల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే ఈ ప్రాంతంలో లాజిస్టిక్‌ పార్కులు మరింతగా పెరగనున్నాయి. దీంతో హైదరాబాద్‌లో వేర్‌ హౌజింగ్‌ నిర్మాణాలకు భారీ డిమాండ్‌ నెలకొంది.

Read Also : Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు