Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు

ఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులిద్దరికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు.

Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు

Indian middle want to invest affordable housing projects

affordable housing projects: ఎక్కడో ఓ చోట.. ఎప్పుడో ఒకప్పుడు సొంత గూడును కలిగివుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారైతే ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకుని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతింటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి స్థలాల ధరలు, గృహాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్‌లాంటి నగరాల్లో అయితే ఇంటిని కొనుగోలు చేయాలంటే లక్షలు, కోట్ల రూపాయలు కావాల్సిందే. పెరిగిన ఇంటి స్థలం ధరలకు తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటి ధరలు ఇప్పుడు మధ్య తరగతివారికి అందుబాటులో లేకుండాపోయాయి.

ప్రస్తుతం అఫర్డుబుల్‌ ప్రైస్‌లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులిద్దరికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నెలకు 50 వేల రూపాయల వేతనం ఉన్నప్పటికీ చాలా మంది ఇల్లు కొనుగోలుకు ధైర్యం చేయడం లేదు.

అందరికీ ఇల్లు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ముఖ్యంగా అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్ట్స్ చేపట్టే బిల్డర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తోంది. రెసిడెన్షియల్ యూనిట్ ఒక్కొక్కటి మెట్రో నగరాలైతే 60 చదరపు మీటర్లు, నాన్‌ మెట్రో ప్రాంతాలైతే 90 చదరపు మీటర్లకు మించకుండా ఉండే వాటిని అఫర్డబుల్ ప్రాజెక్టుల క్రింద గుర్తిస్తోంది. ప్రాపర్టీ స్టాంప్ విలువ 45 లక్షల రూపాయలకు మించని ఇళ్లకు కేంద్రం పలు రాయితీలు అందిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే వచ్చే లాభాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగాయంటే?

కొనుగోలుదారులు అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా జీఎస్టీ 5 శాతం చెల్లించాలి. కానీ అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేస్తే జీఎస్టీ కేవలం ఒక శాతం మాత్రమే ఉంటుంది. అంతే కాదు ఆదాయ పన్ను నుంచి భారీ మినహాయింపులు పొందుతారు. హోం లోన్‌పై ఇన్‌కమ్ టాక్స్ సెక్షన్-24 ద్వారా సాధారణంగా 2 లక్షల రూపాయల మేర వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపుగా చూపవచ్చు. అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టులు రావడం లేదు.

Also Read: హైదరాబాద్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోన్న నిర్మాణ రంగం.. స్థిరమైన వృద్ధితో ఫుల్‌ జోష్‌

ముఖ్యంగా హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లో కూడా 45 లక్షల పైబడి ప్రాజెక్టులే తప్ప అఫర్డబులిటీని దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు ప్రాజెక్టులు నిర్మించడం లేదు. 30 లక్షల రేంజ్ నుంచి 45 లక్షల రేంజ్ ధరల్లో ఇళ్లు లభిస్తే మెజార్టీ సంఖ్యలో ఉన్న మధ్య తరగతి వారి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణరంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకుంటుంది.

Also Read: అవయవ దానం సమయంలో ముందస్తుగా నిర్వహించే పరీక్షలు ఇవే!

ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ రాయితీలతో భూములను ఇచ్చి అఫర్డబుల్ హౌజింగ్ ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణం మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.