IBM Cut Jobs : ఐబీఎం ఉద్యోగులకు షాక్.. ఆ రెండు విభాగాల్లోనే భారీగా కోతలు!

ఐబీఎం భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో గణనీయంగా ఉద్యోగులను తొలగించనుంది. ఐబీఎమ్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ జోనాథన్ అడాషేక్ ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన విడుదల చేశారు.

IBM Cut Jobs : ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం మరోసారి భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. ప్రత్యేకించి మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో గణనీయంగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీకి ఉన్న డిమాండ్ దృష్ట్యా కంపెనీలో కొత్త ఏఐ సాంకేతికను ఉపయోగించే దిశగా అడుగులు వేస్తోంది.

Read Also : Apple CEO Tim Cook : హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఐఫోన్‌తో తీసిన ఫొటో షేరింగ్..!

ఈ క్రమంలోనే కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ ఉద్యోగుల తొలగింపు అనివార్యమని పేర్కొన్నారు. దాదాపు 204 టెక్ కంపెనీలు సమిష్టిగా దాదాపు 50వేల మంది ఉద్యోగాలను తొలగిస్తున్నట్టుగా ప్రకటించాయి. 2024లో ఐబీఎమ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో గణనీయమైన ఉద్యోగ కోతలను విధించాలని ఈ నిర్ణయం తీసుకుంది. నివేదిక ప్రకారం.. ఐబీఎమ్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ జోనాథన్ అడాషేక్ ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన విడుదల చేశారు.

ఉద్యోగ కోతలు గణనీయంగా ఉండే అవకాశం :
అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుందో ఐబీఎం వెల్లడించనప్పటికీ, ఉద్యోగ కోతల సంఖ్య గణనీయంగానే ఉంటుందని తెలుస్తోంది. ఐబీఎం బ్రాండ్ ఇమేజ్‌ని రూపొందించడం, వాటాదారులకు సంబంధించిన యూనిట్‌లో పనిచేసే ఉద్యోగులపైనే వేటు పడనుంది. ఏఐ టెక్నాలజీపైనే దృష్టిసారించిన ఐబీఎం ఆ దిశగానే శ్రామిక శక్తిని పెంచాలని భావిస్తోంది.

గత డిసెంబరులో, సీఈఓ అరవింద్ ఏఐ ఆధారిత టెక్నాలజీపై పనిచేసే నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులే సంస్థకు అవసరమని నొక్కిచెప్పారు. ఈ ప్రణాళికలో దాదాపు 8వేల ఉద్యోగాలను ఏఐ-ఆధారిత ఉద్యోగులతో భర్తీ చేయనుంది. గత జనవరిలో ఐబీఎమ్ దాదాపు 4వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

10వేల మందిని తొలగించిన ఇతర టెక్ దిగ్గజాలు :
టెక్ పరిశ్రమ మొత్తం ఇటీవలి నెలల్లో భారీగా కోతలను ప్రకటించింది. నివేదిక ప్రకారం.. సుమారు 204 టెక్ కంపెనీలు సమిష్టిగా దాదాపు 50వేల ఉద్యోగాలను తొలగించాయి. ఐబీఎమ్ కూడా ఇదే బాటలో తమ ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన చేసింది. ఇప్పటికే, ఆల్ఫాబెట్, అమెజాన్, యూనిటీ వంటి ప్రముఖ కంపెనీలు కూడా భారీ ఉద్యోగ తొలగింపులను ప్రకటించాయి. 2023 నుంచి ఉద్యోగాల్లో కోత ప్రక్రియ కొనసాగుతుండగా.. అమెజాన్, మెటా వంటి కంపెనీలు సైతం 10 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.

మరోవైపు.. చాలా మంది అధిక నైపుణ్యం కలిగిన టెక్ ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుత నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులకే ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని కంపెనీలు సైబర్‌సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నిర్దిష్ట రంగాల్లో ఇంకా నియామకాలు చేపడుతూనే ఉన్నాయి.

Read Also : Apple CEO Tim Cook : హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఐఫోన్‌తో తీసిన ఫొటో షేరింగ్..!

ట్రెండింగ్ వార్తలు