India to be top-3 economic powers in 10-15 years says FM Niramala
Economic Power: వచ్చే 10-15 ఏళ్లలో అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన అమెరికా-ఇండియా బిజినెస్ అండ్ ఇన్వెస్టిమెంట్ ఆపార్చునిటీస్ అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక దృక్పథం సవాలుగా ఉందని, అయితే ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావానికి భారత ఆర్థిక వ్యవస్థ లోను కాలేదని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. కొద్ది రోజుల క్రితమే ఇంగ్లాండును అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అలాగే రానున్న పదేళ్లలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 10-15 ఏళ్లలో భారత్ అవతరిస్తుందని అనుకుంటున్నాం’’ అని నిర్మల అన్నారు.
సాధారణం కంటే ఎక్కువగా ఉన్న నైరుతి రుతుపవనాలు, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్, బలమైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్‌లు, ఉల్లాసమైన వినియోగదారు, వ్యాపార విశ్వాసాలతో పాటు కోవిడ్-19 మహమ్మారి ముప్పు తగ్గుముఖం పట్టడంతో భారతదేశం తన వృద్ధి పథాన్ని రూపొందించిందని సీతారామన్ చెప్పారు. వీటితో పాటు ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని ముఖ్యమైన చర్యల గురించి ఆర్థిక మంత్రి తెలిపారు.
“విదేశీ మూలధన ప్రవాహాలు భారతదేశ వృద్ధిలో కీలకమైన అంశాలని మేము గుర్తించాము. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) నిబంధనల సరళీకరణ, హేతుబద్ధీకరణ, మొత్తం విదేశీ పెట్టుబడి పరిమితి పెంపు, ఎఫ్‌పీఐల నమోదు కోసం సాధారణ దరఖాస్తు ఫారమ్ పరిచయం, స్వచ్ఛంద నిలుపుదల మార్గం వంటి రుణ పెట్టుబడుల కొత్త మార్గాలను తెరవడం వంటి కీలక సంస్కరణలు ఉన్నాయి. ఈ చర్యల పర్యవసానాలు ఎఫ్‌పిఐ ద్వారా భారత్‌లోకి ప్రవేశించే స్థిరమైన ట్టుబడి ప్రవాహాలలో ప్రతిబింబిస్తుంది’’ అని ఆమె అన్నారు.
భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, గత దశాబ్దంలో సగటు స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 5.5 శాతంగా ఉందని నిర్మల అన్నారు. ప్రస్తుతం మూడు మెగాట్రెండ్‌లు-గ్లోబల్ ఆఫ్‌షోరింగ్, డిజిటలైజేషన్, ఎనర్జీ ట్రాన్సిషన్-1 బిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశంలో అపూర్వమైన ఆర్థిక వృద్ధికి వేదికను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మల అన్నారు.
Bharat Jodo Yatra: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ డుమ్మా