Income From Home: ఇలా చేస్తే.. మీ సొంత ఇంటితోనే నెల నెల ఆదాయం పొందొచ్చు..!
అంతేకాదు ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు కొంత కాలానికే ఖర్చైపోవచ్చు. ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏంటి?

Income From Home: అవును.. రిటైర్మెంట్ తర్వాత మీ సొంత ఇంటితోనే మీరు నెల నెల ఆదాయం పొందొచ్చు. ప్రతి నెల పెన్షన్ కూడా అందుకోవచ్చు. రిటైర్ మెంట్ అయ్యాక ఆదాయం ఆగిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు.
నెల వారీ ఖర్చుల గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదు. అందుకు ఒక మార్గం ఉంది.. అదే.. రివర్స్ మార్ట్‌గేజ్ లోన్.
రిటైర్ మెంట్ అయ్యాక ఆదాయ మార్గం లేని వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉండటానికి ఇల్లున్నా ఆదాయం లేక నెల వారీ ఖర్చులు పెద్ద సమస్యగా మారుతున్నాయి.
వయసు పైబడ్డాక ఆదాయ వనరులు తగ్గిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఇలాంటి వారికి వారి సొంత ఇల్లే ఓ మార్గాన్ని చూపుతుంది. నెల నెల ఆదాయం వచ్చేలా చేస్తుంది. ఎలా అంటే.. రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ ద్వారా.
జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ గృహరుణ సంస్థలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇల్లు, ఫ్లాట్ విలువను బట్టి నెల నెల ఆదాయాన్ని అందిస్తున్నాయి.
ఆర్థిక సమస్యల కారణంగా కొందరు ఇంటిని అమ్మేస్తారు. అలా చేస్తే పెద్ద మొత్తంలోనే డబ్బు వస్తుంది.
ఆ డబ్బుని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుని వచ్చే వడ్డీతో బతికేయొచ్చని అనుకుంటారు. కరెక్టే, అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ, ఇలాంటి సందర్భంలో మీరు మీ సొంత ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది.
అంతేకాదు ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు కొంత కాలానికే ఖర్చైపోవచ్చు. ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? అలా కాకుండా ఇంటిని బ్యాంకుకు రివర్స్ మార్ట్‌గేజ్ చేస్తే మీరు బతికినంత కాలం అందులోనే ఉండొచ్చు.
పైగా మీరే యజమానిగానూ కొనసాగుతారు.
ఈఎంఐల రూపంలో బ్యాంకులే డబ్బులు ఇస్తాయి..
బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే నెల నెల వాయిదాల్లో తీర్చాలి. ఇంటిని తాకట్టు (మార్ట్‌గేజ్) పెడితే రుణమిస్తాయి. కానీ ఈఎంఐలు ఎలా చెల్లిస్తారు?
మీ ఆదాయం ఆధారాలు చూపాలని బ్యాంకులు అడుగుతాయి. అదే.. రివర్స్ మార్ట్‌గేజ్‌లో అలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఈఎంఐల రూపంలో బ్యాంకులే డబ్బులు చెల్లిస్తాయి.
ఈ మొత్తం ఎంత అన్నది ఇంటి విలువపై ఆధార పడి ఉంటుది.
ఆ తర్వాత ఇంటి విక్రయం..!
రివర్స్ మార్ట్‌గేజ్ తీసుకున్న వారి మరణం తర్వాత లేదంటే శాశ్వతంగా ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లాక బ్యాంకులు ఆ ఇంటిని విక్రయిస్తాయి.
ఈఎంఐల రూపంలో ఇచ్చిన మొత్తాన్ని దానిపై వడ్డీని మినహాయించుకుని మిగిలింది వారసులకు చెల్లిస్తాయి.
వారసులే ఆ మొత్తాన్ని చెల్లించి ఇంటినైనా తీసుకోవచ్చు.
అద్దెకు ఇచ్చిన ఇళ్లను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవు.
ఎవరెవరు అర్హులు?
రివర్స్ మార్ట్‌గేజ్ లోన్‌కు 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు.
ఈఎంఐలు కట్టాల్సిన ఇబ్బందులు ఉండవు. ఇంటిని వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరమూ లేదు.
బ్యాంకు, ఆర్థిక సంస్థలే మీకు నెల నెల (లేదంటే 3 నెలలకు ఒకసారి) డబ్బును ఇస్తాయి.
దరఖాస్తుదారు వయసును బట్టి ఈ చెల్లింపులు గరిష్ఠంగా 10-15-20 ఏళ్లపాటు కొనసాగుతాయి..
ప్రారంభంలో కొంత మొత్తం ఇచ్చి ఆ తర్వాత ఈఎంఐల రూపంలోనూ చెల్లిస్తాయి.