Gold: కేంద్ర బ్యాంకులన్నీ బంగారాన్ని కొనేస్తున్నాయి.. మరి మీరెందుకు కొనరు? ఎందుకు చెబుతున్నామంటే?

బంగారంపై పెట్టుబడి ఎప్పటికీ విలువైనదే.

కేంద్ర బ్యాంకులు బంగారం కొనడంలో తగ్గేదెలే అంటున్నాయి. 2022లో 1,082 టన్నులు, 2023లో 1,037 టన్నులు, అలాగే రికార్డు స్థాయిలో 2024లో 1,180 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి కేంద్ర బ్యాంకులు.

అమెరికా దగ్గర 8,133 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది, దీని విలువ $682,276 మిలియన్లు. అలాగే భారతదేశం 876 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది, దీని విలువ దాదాపు $73 బిలియన్లు (రూ.73,498 కోట్లు).

బంగారం ఎప్పటినుంచో ప్రపంచ బ్యాంకులకు రిజర్వ్ ఆస్తిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం అలాగే భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తల కారణంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని మరింత కొనుగోలు చేస్తున్నాయి.

కొవిడ్-19 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసరాల ధరల పెరగడంతో.. అలాగే 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై, ఇజ్రాయెల్, చైనా, తైవాన్ ప్రాంతాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడం వల్ల బంగారం.. మానవాళికి సంక్లిష్ట పరిస్థితుల వేళ ఓ ఆశగా మారడంతో దేశాలు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించాయి.

ఇండియా కూడా బంగారాన్ని రిజర్వ్ ఆస్తిగా ఉపయోగిస్తోంది. 2024లో, పోలాండ్ 89.54 టన్నుల బంగారం కొనుగోలు చేసి, అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. అలాగే భారతదేశం 72.60 టన్నులు కొనుగోలు చేయగా, చైనా 44.17 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.
2024 సెప్టెంబర్ నాటికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ 854 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. అందులో 510 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశీయంగా నిల్వ చేశారు. ఇంకా 324 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ లాంటి అంతర్జాతీయ సంస్థల వద్ద నిల్వ చేశారు.

2024 మేలో 100 టన్నులు, 2024 అక్టోబర్‌లో మరో 102 టన్నులు బంగారాన్ని లండన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చింది భారతదేశం . 2023లో అమెరికా దాని మిత్రదేశాలు రష్యా $300 బిలియన్ల విలువైన విదేశీ మారక నిల్వలను, బంగారాన్ని బ్లాక్ చేశాయి.

దీని కారణంగా, విదేశాలలో నిల్వ చేయబడిన ఆస్తులు ఏ సమయంలోనైనా నిలిపివేయబడే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు గ్రహించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, RBI తన రిజర్వులలో ఒక భాగాన్ని భారతదేశానికి తరలించింది. కేంద్ర బ్యాంకులే పెద్ద ఎత్తున బంగారాన్ని కొంటున్నాయి. మరి మీరెందుకు కొనరు. కొంటే ఆర్థిక సంక్షోభం నుంచి బంగారం మిమ్మల్ని బయటపడేస్తుంది.

ఒక వ్యక్తి ఇండియాలో ఎంత బంగారాన్ని కొనవచ్చు?
– సరైన ఆదాయ మార్గాల ద్వారా పొందిన బంగారం నిల్వకు పరిమితి లేదు.

– పెళ్లయిన మహిళకు 500 గ్రాముల బంగారం, పెళ్లి కానీ మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం వరకు నిల్వ చేసుకోవచ్చు.

బంగారంపై పెట్టుబడి ఎప్పటికీ విలువైనదే. ఇది స్టాక్ మార్కెట్ మాదిరిగా అధిక లాభాలను ఇచ్చే పెట్టుబడి కాదేమో గానీ, స్థిరమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది. మంచి సమయాల్లో స్టాక్స్ లాభాలు అందిస్తాయి, కానీ ప్రతికూల పరిస్థితుల్లోనూ బంగారం రక్షణగా మారుతుంది.