Inverter vs Non-Inverter AC
Inverter vs Non-Inverter AC : అసలే ఎండాకాలం.. వేసవిలో ఎండలు పెరిగేకొద్ది కూలర్లు, ఎయిర్ కండిషనర్ల (AC) డిమాండ్ భారీగా పెరుగుతుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తేలికపాటి వేడి సమయంలో కూలర్లు బెటర్ అయినా రానురాను ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పెద్దగా కూలింగ్ ఇవ్వలేవు.
అందుకే చాలామంది కూలర్లకు బదులుగా ఎయిర్ కండిషనర్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఈ వేసవిలో కొత్త ఏసీ కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం. చాలా మందికి మార్కెట్లో ఎలాంటి ఏసీని కొనుగోలు చేయాలో పెద్దగా అవగాహన ఉండదు.
అసలు ఇన్వర్టర్ ఏసీ లేదా నాన్-ఇన్వర్టర్ ఏసీ అంటే కూడా తెలియకపోవచ్చు. తెలిసినా ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలా అని తెగ ఆలోచిస్తుంటారు. ఈ రెండు రకాల ఎయిర్ కండిషనర్ల మధ్య తేడాలేంటి? ఏది కొంటే బెటర్ అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఇన్‌స్టాల్ చేసిన సాధారణ ఇన్వర్టర్‌తో ఇన్వర్టర్ ఏసీని నడపవచ్చని చాలా మంది తప్పుగా భావిస్తుంటారు. కానీ, అది వర్కౌట్ కాదని గమనించాలి. “ఇన్వర్టర్” అనే పదం వాస్తవానికి ఈ యూనిట్లలో ఉపయోగించే ఒక నిర్దిష్ట టెక్నాలజీని సూచిస్తుంది. ఏసీ కొనేటప్పుడు కూలింగ్ సామర్థ్యంతో పాటు పవర్ వినియోగం వంటి అంశాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి.
సరైన ఏసీని ఎంచుకోవడం వల్ల తగినంత కూలింగ్ రాకపోవడమే కాకుండా భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రావొచ్చు. ప్రస్తుత మార్కెట్లో మీరు రెండు ప్రధాన రకాల ఏసీలు చూడొచ్చు. ఇన్వర్టర్, నాన్-ఇన్వర్టర్ ఏసీలు. మీకు ఏ ఎయిర్ కండిషనర్ అనుకూలంగా ఉంటుంది? ఏది మీకు డబ్బు ఆదా చేయడంతో పాటు విద్యుత్ బిల్లులు తగ్గేలా చేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇన్వర్టర్ ఏసీ అంటే ఏంటి? :
ఇన్వర్టర్ ఏసీలు కంప్రెసర్ వేగాన్ని నియంత్రించే అడ్వాన్స్ టెక్నాలజీతో పనిచేస్తాయి. మీరు ఏసీని ఆన్ చేసినప్పుడు గదికి కావలసిన టెంపరేచర్‌లో త్వరగా చల్లబరుస్తుంది. ఆ తర్వాత అది కంప్రెసర్‌ను ఆపకుండా స్పీడ్ తగ్గిస్తుంది.
ఈ విధానంతో తక్కువ విద్యుత్తును వినియోగిస్తూ స్టేబుల్ కూలింగ్ అందిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే.. ఇన్వర్టర్ ఏసీ ఆన్, ఆఫ్ కాకుండా తక్కువ వేగంతో నడుస్తుంది. ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది అనమాట. ఫలితంగా ఇంటి గది కూలింగ్‌తో పాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది.
నాన్-ఇన్వర్టర్ ఏసీల సంగతేంటి? :
నాన్-ఇన్వర్టర్ ఏసీతో కంప్రెసర్ పూర్తి పవర్ లేదా అసలు పనిచేయదు. మీరు మొదట ఆన్ చేసినప్పుడు గది కావలసిన ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు కంప్రెసర్ రన్ అవుతుంది. ఆ సమయంలో వెంటనే ఆగిపోతుంది. అయితే, ఉష్ణోగ్రత మళ్ళీ పెరిగిన వెంటనే కంప్రెసర్ తిరిగి ఆన్ అవుతుంది. ఇలా పదే పదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఫలితంగా విద్యుత్ బిల్లులు తడిసిమోపెడు అవుతాయి.
కూలింగ్ సామర్థ్యం విషయానికి వస్తే.. ఇన్వర్టర్ ఏసీలు పైచేయి సాధిస్తాయి. గది తగినంత కూల్‌గా ఉన్నప్పటికీ కంప్రెషర్‌లు పనిచేస్తాయి. తద్వారా చల్లని గాలి స్థిరంగా వస్తుంటుంది. అదే ఇన్వర్టర్ కాని ఏసీలు గదిని త్వరగా కూలింగ్ చేస్తాయి.
కానీ, స్టేబుల్ ఆన్-అండ్-ఆఫ్ సైక్లింగ్ కారణంగా తరచుగా ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. అందుకే పవర్ బిల్లులను ఆదా చేయడంతో పాటు ఇంటిని ఒకే టెంపరేచర్ వద్ద ఉంచుకోవాలని భావిస్తే మాత్రం ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవడం అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.