ఈపీఎస్-95 పెన్షన్ పెరుగుతుందా? మీకు ఎంత డబ్బు వస్తుందో, లెక్క ఎలా వేస్తారో తెలుసుకోండి..
అనేక ఉద్యోగాలు చేసినా అన్ని ఈపీఎస్ ఖాతాలు కలిపి ఒకే పెన్షన్‌గా లెక్కిస్తారు.
EPS: ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) అనేది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) అందించే ప్రయోజనాలలో ఓ భాగం. దీన్ని రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ అందించేందుకు రూపొందించారు. సభ్యుడు మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా పెన్షన్ అందుతుంది.
ఈ పథకం ప్రధానంగా భారతదేశంలోని వ్యవస్థీకృత రంగం ఉద్యోగులను కవర్ చేస్తుంది. ఈపీఎస్-1995లో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. 2026లో ఈపీఎస్-95 పెన్షన్ పెరుగుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఎంత పెన్షన్ వస్తుందో, లెక్క ఎలా వేస్తారో తెలుసుకోండి..
ఉద్యోగి, అతడు/ఆమె పనిచేస్తున్న సంస్థ బేసిక్ జీతంతో పాటు డీఏపై 12 శాతం చొప్పున ఈపీఎఫ్‌లో చెల్లిస్తారు. సంస్థ యజమాని వాటాలో 8.33 శాతం (గరిష్ఠంగా రూ.1,250 వరకు) ఈపీఎస్‌కు వెళుతుంది. ప్రభుత్వము రూ.15,000లోపు జీతం పొందే ఉద్యోగులకు 1.16 శాతం (గరిష్ఠంగా రూ.174 వరకు) చెల్లిస్తుంది.
ఈపీఎస్ పెన్షన్ పొందేందుకు అర్హతలు ఇవే..
- ఈపీఎఫ్‌ఓ సభ్యత్వం ఉండాలి
- కనీసం 10 సంవత్సరాలు ఈపీఎస్‌కు చెల్లించాలి
- వయస్సు 58 సంవత్సరాలు చేరిన తర్వాత పూర్తి పెన్షన్
- 50 సంవత్సరాల వయస్సు నుంచే ముందస్తు పెన్షన్ పొందవచ్చు, అయితే ప్రతి సంవత్సరం 4 శాతం తగ్గింపు ఉంటుంది
ఈపీఎస్ పెన్షన్‌ను లెక్కించే సూత్రం
- పెన్షన్ = (సగటు జీతం × పెన్షన్ సర్వీస్ సంవత్సరాలు) ÷ 70
- సగటు జీతం: చివరి 60 నెలల బేసిక్ జీతం + డీఏ (గరిష్ఠంగా రూ.15,000 వరకు)
- పెన్షన్ సర్వీస్: ఈపీఎస్ కింద పనిచేసిన మొత్తం సంవత్సరాలు (గరిష్ఠం 35 సంవత్సరాలు)
- 20 సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉంటే అదనంగా 2 సంవత్సరాలు చేర్చుతారు
కనిష్ఠ, గరిష్ఠ పెన్షన్ పరిమితులు
కనిష్ఠ పెన్షన్: నెలకు రూ.1,000
గరిష్ఠ పెన్షన్: రూ.15,000 × 35 ÷ 70 = రూ.7,500 (నెలకు)
(అనేక ఉద్యోగాలు చేసినా అన్ని ఈపీఎస్ ఖాతాలు కలిపి ఒకే పెన్షన్‌గా లెక్కిస్తారు)
ఈపీఎస్‌లో ఉన్న పెన్షన్ రకాలు
- సూపర్ యాన్యుయేషన్ పెన్షన్: 58 ఏళ్ల తర్వాత
- ముందస్తు పెన్షన్: 50 ఏళ్ల వయస్సు నుంచి (తగ్గింపు రేటుతో)
- వికలాంగుల పెన్షన్: శాశ్వత వికలాంగుడు అయినప్పుడు
- కుటుంబ పెన్షన్: సభ్యుడు మరణించిన తర్వాత భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులకు
గమనించాల్సిన ముఖ్యాంశాలు
- ఈపీఎస్ నిధి ప్రధానంగా సంస్థ యజమానుల ద్వారా సమకూరుతుంది
- పెన్షన్ మొత్తం సర్వీస్ సంవత్సరాలు, సగటు జీతంపై ఆధారపడి ఉంటుంది
- లెక్కించే జీత పరిమితి రూ.15,000
- ఈపీఎఫ్ పాస్‌బుక్ ద్వారా ఈపీఎస్ వివరాలు ఎపీఎఫ్‌ఓ పోర్టల్‌లో చూడవచ్చు
- విత్‌డ్రా ఆలస్యం చేసి 60 ఏళ్ల వరకు వేచిస్తే ప్రతి సంవత్సరం 4 శాతం పెరుగుతుంది
