జియో సంచలనం : రూ. 600కే బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ కాంబో

  • Publish Date - April 24, 2019 / 03:57 AM IST

టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన రిలయెన్స్ Jio త్వరలోనే జియో గిగా ఫైబర్‌తో మరో విప్లవానికి రెడీ అవుతోంది. నెలకు కేవలం రూ. 600కే గిగా ఫైబర్ ద్వారా బ్రాండ్ బ్యాండ్, టీవీ ఛానళ్ల ప్రసారాల సేవలను అందించనుంది. ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో పరిశీలించనుంది. వన్ టైమ్ డిపాజిట్ కింద రూటర్ కోసం రూ. 4 వేల 500 తీసుకుని 100 గిగా బైట్స్ డేటాను 100 MBPS వేగంగా ఉచితంగా వినియోగదారులకు అందించనుంది. అనంతరం ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. వచ్చే మూడు నెలల కాలంలో బ్రాండ్ బ్యాండ్‌కు అనుసంధానంగా టెలిఫోన్, టెలివిజన్ సేవలను సైతం దీనికి జోడించనుంది. అన్ని సేవలు ఏడాది పాటు ఉచితంగా లభిస్తాయి. ల్యాండ్ లైన్ ఫోన్ అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుందని.. టెలివిజన్ ఛానళ్లను ఇంటర్నెట్ (IPT) ద్వారా అందించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.  

ఆఫ్టికల్ నెట్ వర్క్ టెర్మినల్ బాక్స్ రూటర్ ద్వారా అందిస్తుంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్ టాప్‌లు, ట్యాబ్‌లు తదితర 45 పరికరాలను రూటర్‌తో అనుసంధానించుకోవచ్చని ప్రకటించింది. రూ. 600 నెలవారి ప్లాన్‌లో 600 ఛానల్స్‌‌ను ఏడు రోజుల క్యాచర్ ఆఫ్షన్‌తో ఆఫర్ చేస్తామని వెల్లడించింది జియో. ప్లాన్ ఛార్జీ ఆ తర్వాత రూ. 1000 వరకు పెంచే అవకాశం ఉండనుంది. అలాగే గిగా ఫైబర్‌తో సీసీటీవీ సర్వేలైన్ వీడియోను, ఇతర డేటాను క్లౌడ్‌లో సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి 1,100 పట్టణాల్లో జియో గిగా ఫైబర్ ఆరంభించనున్నట్లు గతేడాది జూన్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే ఎయిర్ టెల్ మాత్రం జియోను కాపీ కొట్టకుండా దేశంలోని టాప్ – 100 పట్టణాల్లో ప్రీమియం కస్టమర్లపై దృష్టి పెట్టే ఆలోచనలో ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. రిలయెన్స్ ఇండస్ట్రీస్ గతేడాది అక్టోబర్‌లో డెన్ నెట్ వర్క్, హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్‌లో మెజార్టీ వాటాను రూ. 5 వేల 230 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ కొనుగోళ్ల ద్వారా జియో గిగా ఫైబర్‌కు ఊతమివ్వగలదని కంపెనీ భావిస్తోంది.