land investment rental monetisation give higher profit in hyderabad
Hyderabad Land investment : తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మంచి జోరుమీదుంది. అందులోనూ హైదరాబాద్‌లో నిర్మాణరంగం దినదినాభివృద్ది చెందుతోంది. నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులతో హైదరాబాద్.. దేశంలోని ఇతర నగరాలను మించిపోతోంది. మరోవైపు హైదరాబాద్‌లో భూముల ధరలు ఎక్కడా లేని విధంగా పెరిగిపోయాయి. మొన్న కోకాపేట్‌లో ఎకరం వంద కోట్ల రూపాయల ధర పలకడంతో ప్రపంచమే నివ్వెరైపోయి చూసింది. ఎకరం ధర ఇంత భారీ స్థాయిలో పలకడం దేశంలో ఇదే మొదటిసారని రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రభుత్వం వేలం వేసే భూములతో పాటు ప్రైవేటు భూములకు సైతం హైదరాబాద్‌లో భారీ డిమాండ్ నెలకొంది. దేశవిదేశాల నుంచి ఇన్వెస్టర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిచూపుతుండటమే ఇందుకు కారణమని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
భూముల కొనుగోళ్లలో టాప్-5 కారిడార్లలో హైదరాబాద్
భూములపై పెట్టుబడులకు దేశంలోని టాప్-5 కారిడార్లలో మన హైదరాబాద్ కూడా స్థానం సంపాదించింది. భారత్‌లోని ప్రధాన మెట్రో నగరాల్లో భూములపై ఇన్వెస్ట్ చేసేందుకు అత్యున్నతమైన నగరాలు, ప్రాంతాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కింది. హైదరాబాద్‌లోని కొంపల్లి, మేడ్చల్, శామీర్‌పేట కారిడార్‌లో భూములపై పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతమని కొలియర్స్ ఇండియా తమ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు, వాటిని రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని కొలియర్స్ ఇండియా స్పష్టం చేసింది.
Also Read: ఎన్నికలయ్యాకే ఇళ్లు కొంటామంటున్న బయ్యర్లు.. ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?
వచ్చే పదేళ్లలో 3 రెట్ల రిటర్న్స్ రావచ్చనే అంచనాలు
హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి, మేడ్చల్, శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది.
Also Read: రియాల్టీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న ప్రజలు
కొంపల్లి, మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్ బెస్ట్
హైదరాబాద్‌లోని కొంపల్లి, మేడ్చల్, శామీర్‌పేట కారిడార్‌తో పాటు మహారాష్ట్రలోని నేరల్, మాతేరన్, గుజరాత్‌లోని సనంద్, నల్‌సరోవర్ భూములు పెట్టుబడులకు టాప్-5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ కారిడార్లలో పెట్టుబడి పెడితే చక్కని వృద్ధితో భారీ రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చని తెలిపింది. భూమిపై పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుందని అభిప్రాయపడింది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినియోగించుకోవడం తెలిస్తే పెట్టుబడులు కలిసొస్తాయని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో నగరాల్లో ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే మైక్రో మార్కెట్లకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని కొలియర్స్ ఇండియా అంచనా వేసింది.