Hyderabad: ఎన్నికలయ్యాకే ఇళ్లు కొంటామంటున్న బయ్యర్లు.. ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?
ఎన్నికలు ముగిశాకే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదనే యోచనలో ఉన్నారు బయ్యర్స్. ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఇంటి ధరలు, ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది.

buyers like to buy properties after election in hyderabad
Hyderabad Real Estate: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అందరి చూపు ఎలక్షన్ వైపు మళ్లింది. అయితే ఈ సమయంలో ప్రాపర్టీలు కొనాలనుకునేవారు ఆలోచనల్లో పడ్డారు. ఎన్నికలు ముగిశాకే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదనే యోచనలో ఉన్నారు బయ్యర్స్. ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఇంటి ధరలు, ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. దీంతో ఎన్నికల వరకు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు బయ్యర్స్. ఇలాంటి ప్రచారంతో సొంతిల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న మరికొంత మంది సైతం ఆలోచనల్లో పడ్డారు. ఇంటిని ఇప్పుడు కొనుగోలు చేయాలా, లేదంటే ఎన్నికలు అయ్యే వరకు ఆగాలా అన్న ఆయోమయం చాలా మందిలో నెలకొంది.
సొంతిల్లు కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అసలు ఏ మాత్రం సంబంధం లేదని వారు చెబుతున్నారు. అంతే కాదు ప్రస్తుతం మార్కెట్‌లో ఇళ్ల ధరలు కాస్త అందుబాటులోనే ఉన్నాయి. అందులోనూ దేశంలోనే హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌టీ ధర చాలా తక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇల్లు కొనేవారు బిల్డర్‌తో కాస్త బేరం ఆడితే ఆయా ప్రాపర్టీలు తక్కువ ధరకే లభించే అవకాశముంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వందల కొద్దీ భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అందుకే సొంతిల్లు కొనాలనుకుంటున్న వారు ఇలా మార్కెట్ స్పీడ్ ఉన్న సమయంలోనే నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: అపార్ట్‌మెంట్‌లో ఏ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొనాలి.. మిడిల్ అయితే బెటరా?
గతంలో కరోనా నాటి పరిస్థితులను రియల్టీ రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. కరోనా సమయంలో ఒక్కసారిగా నెమ్మదించిన స్థిరాస్తి రంగం ఆ తరువాత ఉవ్వెత్తున ఎగిసింది. భూముల ధరలకు తోడు నిర్మాణ సామగ్రి, కూలీల వ్యయం పెరగడంతో ఇంటి ధరలు భారీగా పెరిగాయి. కేవలం రెండేళ్లనే హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఇంటి ధర ఎస్‌ఎఫ్‌టీ వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఇళ్ల ధరలు పెరగడమే తప్పా తగ్గిన సందర్భాలు లేవని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్ వంటి కాస్మోపాలిటిన్ నగరాల్లో నిర్మాణాలు ఏమాత్రం ఆగడం లేదు.
Also Read: రియాల్టీ రంగంలో దూసుకుపోతోన్న హైదరాబాద్.. అనరాక్ లేటెస్ట్ రిపోర్ట్
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిపెట్టే ఇన్వెస్టర్స్ చాలా మంది వేచిసూచే ధోరణి అవలంబిస్తున్నారు. మళ్లీ మార్కెట్ కాస్త కుదురుకోగానే వారంతా పెట్టుబడులకు రెడీ అవుతారని.. అప్పుడు ఒక్కసారిగా రియల్టీ రంగం పుంజుకుంటుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా బేస్తున్నారు. దీంతో భూముల ధరలు, తద్వార ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి గృహ కొనుగోలుదారులకు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు.