×
Ad

Luxury Cars : లగ్జరీ కార్లు కొనేవారికి పండగే.. యూరోపియన్ కార్లపై భారీగా పన్ను తగ్గించే ఛాన్స్.. ఇక BMW, మెర్సిడెస్ కార్లు చౌకగా..?

Luxury Cars : యూరోపియన్ యూనియన్ కార్లపై భారీ మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం కనిపిస్తోంది. అదేగానీ జరిగితే BMW, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్లు చౌకగా లభించనున్నాయి.

Luxury Cars In India

Luxury Cars : లగ్జరీ కారు లవర్స్ కు పండగే పండగ.. మీరు విదేశాల నుంచి ఇంపోర్టెడ్ లగ్జరీ, ప్రీమియం కార్లను కొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద కార్లపై దిగుమతి పన్నును భారీగా తగ్గించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ ముఖ్యమైన డీల్ మంగళవారం, జనవరి 27 నాటికి ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఈయూ తయారీ కార్లపై ప్రస్తుతం ఉన్న 110 శాతం దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలి. ఇది జరిగితే.. భారత ఆటోమొబైల్ మార్కెట్లో దిగుమతి కార్లకు ఫుల్ డిమాండ్ పెరగనుంది.

ప్రారంభ దశలో ఏ కార్లపై పన్ను తగ్గుతుంది? :
మీడియా నివేదికల ప్రకారం.. ఈ సుంకం తగ్గింపు ప్రారంభంలో 15,000 యూరోలు (సుమారు రూ. 16.3 లక్షలు) కన్నా ఎక్కువ ధర కలిగిన కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఉపశమనం ప్రీమియం-సెగ్మెంట్ వాహనాలకే పరిమితం. కాలక్రమేణా దిగుమతి సుంకం మరింత తగ్గవచ్చు.

భవిష్యత్తులో ఈ దిగుమతి సుంకాలను 10శాతానికి తగ్గించే ప్లాన్లు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, BMW వంటి యూరోపియన్ కంపెనీలు భారత మార్కెట్లో కార్లను తక్కువ ధరకే విక్రయించే అవకాశం ఉంటుంది.

Read Also : Union Budget 2026 : కేంద్ర బడ్జెట్‌ 2026 డేట్, టైమ్ ఇదిగో.. మీ మొబైల్, టీవీలో బడ్జెట్ లైవ్ ఇలా చూడొచ్చు.. బడ్జెట్ PDF డౌన్‌లోడ్ ఎలా?

భారత్, ఈయూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు :

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై చర్చలు పూర్తయినట్లు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అనేక ఏళ్ల తరబడి నిలిచిపోయిన చర్చలలో ఇదో పెద్ద ముందడుగు కానుంది. అయితే, డీల్ ప్రకటించిన తర్వాత కూడా అమలుకు ముందు రెండు వైపులా ఖరారు చేసి, అధికారిక ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పుడే ఈ డీల్ పూర్తిగా అమలులోకి వస్తుంది.

అమెరికా, చైనా తర్వాత భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్. అయినప్పటికీ, విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం, పూర్తిగా నిర్మించిన కార్లపై 70 శాతం నుంచి 110 శాతం వరకు పన్నులు విధిస్తున్నారు. ఫలితంగా అనేక ప్రపంచ ఆటో కంపెనీల అధికారులు భారత విధానాన్ని విమర్శించారు.

పన్నులు తగ్గిస్తే యూరోపియన్ కార్లు మరింత చౌకగా :
ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గిస్తే.. యూరోపియన్ కార్ కంపెనీలు భారత మార్కెట్లో తమ వాహనాల ధరలను మరింత పోటీతత్వంతో తగ్గించే అవకాశం ఉంటుందని వర్గాలు తెలిపాయి. వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు భారత్ లో కొత్త మోడళ్లను లాంచ్ చేయొచ్చు. అంతేకాదు.. కార్ల తయారీకి పెద్ద ఎత్తున పెట్టుబడికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

యూరోపియన్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ నివేదికలకు సంబంధించి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ లేదా యూరోపియన్ యూనియన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.