Mahindra Finance Launches Lease Based Vehicle Subscription Business For Urban Centres
Mahindra Quiklyz : ఇచట కొత్త కార్లు అద్దెకు లభించును.. బ్రాండ్ కార్లలో ఎన్ని రోజులు కావాలో అన్నిరోజులు సిటీ మొత్తం చుట్టేయవచ్చు.. ఈ సరికొత్త ఆఫర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. Quiklyz పేరుతో మహీంద్రా ఫైనాన్స్ ఈ లీజ్ ఆధారిత సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ వేదికగా రిటైల్, కార్పొరేట్ క్లయింట్లను లక్ష్యంగా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ వెబ్ సైట్ నుంచి అన్ని బ్రాండ్ల మోడళ్ల కొత్త కార్లు అద్దెకు దొరుకుతాయి. ఈ కార్లను మీరు కొనాల్సిన అవసరం లేదు. కేవలం అద్దెకు మాత్రమే తీసుకోవచ్చు. దీనికి మీరు ముందస్తుగా ఎలాంటి చెల్లింపు అవసరం లేదు. కనీస చందా నెలకు రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. 24 నెలల నుంచి 60 నెలలకు కస్టమర్ కనీస మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీకు నచ్చిన సరికొత్త కారును అద్దెకు తీసుకోవచ్చు.
మీరు చేయాల్సిందిల్లా.. క్విక్‌లీజ్ (Quiklyz) వెబ్‌సైట్ విజిట్ చేయడమే.. అందులో లాగిన్ అయిపోండి.. కారుతోపాటు కంపెనీ నుంచి ఎలాంటి సర్వీసులు కావాలో మీరే ఎంచుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించండి చాలు.. స్టాక్ అందుబాటులో ఉంటే వెంటనే మీ ఇంటి ముందు కొత్త కారు ప్రత్యక్షమవుతుంది. ఆ కారుకు వైట్ నెంబర్ ప్లేట్ మీ పేరుతోనే ఉంటుంది. మీరు ఎంచుకున్న ప్లాన్ సర్వీసు ప్రకారం.. ఆ కారు మీ వెంటే ఉంచుకోవచ్చు. ప్లాన్ గడువు ముగిసిన వెంటనే కారును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ కారు మీకు నచ్చి కొనుగోలు చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. లేదంటే ఆ కారు వదిలేసి మరో కొత్త కారుకు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం అందిస్తోంది. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీలో ఇప్పటివరకూ 8 రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 22 మోడళ్లు రెంటుకు రెడీగా ఉన్నాయి. ఇంకా సరికొత్త కారు మోడళ్లు వస్తాయని కంపెనీ అంటోంది. ఈ క్విక్ లీజ్ (Quicklyz) కార్లు.. హైదరాబాద్ సిటీతో పాటు మరో 8 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో 30 సిటీలకు ఈ సర్వీసులను అందించాలని కంపెనీ భావిస్తోంది.
Read Also : CBDT : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు రీఫండ్