మారుతీ సుజుకీ, టాటా మోటర్స్ కంపెనీలకు చెందిన వాహనాలను కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. ఆ కంపెనీల వాహనాల ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి కమర్షియల్ వెహికల్స్ ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.
ముడి సరుకులపై ఖర్చులు పెరగడంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్ కార్లతో పాటు యుటిలిటీ వాహనాల, ట్రక్కులు, బస్సుల ధరలు పెరగనున్నాయి. మరోవైపు, మారుతి సుజుకీ 4 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
Also Read: ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర.. ఇలాగైతే కొనేదెలా?
ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలు, మాడల్ బట్టి ఈ ధరలు పెరుగుతాయని తెలిపింది. వినియోగదారులపై ధరల పెంపు భారాన్ని తగ్గించాలని వీలైనంత వరకు కంపెనీయే భరిస్తోందని చెప్పింది. అయినా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కస్టమర్లపై కొద్దిపాటి భారం వేయకతప్పడం లేదని తెలిపింది.
ఇప్పటికే జనవరిలో మారుతి కార్ల ధరలను దాదాపు రూ.32,500 వరకు పెంచింది. గత నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఆ కంపెనీకి చెందిన తక్కువ బడ్జెట్ కారు ఆల్టో కే-10. ఈ కారు ధర రూ.4.23 లక్షలు. ఆ కంపెనీ కార్లలో గరిష్ఠ ధర రూ.29.22 లక్షలుగా ఉంది.
మరోవైపు, కార్ల ధరలను తాము కూడా పెంచాలనుకుంటున్నామని హోండా కార్స్ ఇండియా అంటోంది. ధరల పెంపుపై హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎటువంటి కామెంట్ చేయడం లేదు. తయారీ ఖర్చులతో పాటు నిర్వహణ వ్యయాలు పెరిగాయని కార్ల కంపెనీలు అంటున్నాయి. అందుకే వాహనాల ధరలను సవరిస్తున్నట్లు చెబుతున్నాయి.