బంగారం శతాబ్దాలుగా సంపదగా, ప్రతిష్ఠకు చిహ్నంగా ఉంటోంది. ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం కాపాడుతుంది. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా దీన్ని పరిగణిస్తారు. బంగారం ద్రవ్యోల్బణం, కరెన్సీ ఒడిదుడుకుల నుంచి మనకు రక్షణ ఇస్తుంది. బంగారం విలువ పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గదు. బంగారం అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు.. ఇది మన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఒడిశాలో బంగారు ఖనిజ నిక్షేపాలు
ఒడిశా ఖనిజ సంపదకు నిలయం. ఇటీవలి కాలంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకటనతో ఒడిశా బంగారు తవ్వకాలకు కీలక కేంద్రంగా మారింది. ఈ బంగారు నిధుల ఆవిష్కరణను గనుల మంత్రి బిభూతి భూసన్ జెనా ధ్రువీకరించారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో అన్వేషణ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే బంగారు మైనింగ్ బ్లాకుల వేలం పాటలు ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఎక్కడ బంగారం నిధులను ఎక్కడ కనుగొన్నారు?
ఈ బంగారు నిక్షేపాలను ప్రధానంగా సుందర్‌గఢ్, నవరంగ్‌పూర్, కేయోంజార్, దేవ్‌గఢ్ జిల్లాల్లో కనుగొన్నారు. మల్కాన్‌గిరి, సంబల్పూర్, బౌధ్ ప్రాంతాల్లో కూడా బంగారం కోసం అన్వేషణ కొనసాగుతోంది. మయూర్‌భంజ్ జిల్లాలోని జాషిపూర్, సూర్యగూడ, రువాంసి, ఇదెల్కుచా, మరేధిహి, సులెపాత్, బడంపహాడ్ వంటి ప్రాంతాలు కూడా పరిశోధనలో భాగంగా ఉన్నాయి.
Also Read: రాజకీయాల్లో పెను సంచలనం.. ఈ ఏడాది వీరు పదవి నుంచి దిగిపోయే అవకాశం: వేణుస్వామి
ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు
దేవ్‌గఢ్ జిల్లాలో ఆదసా-రాంపల్లి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు లభించాయి. భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్‌ఐ) ఆ ప్రాంతంలో G-2 స్థాయి అన్వేషణను నిర్వహిస్తోంది. కేయోంజార్ జిల్లాలో గోపూర్-గాజీపూర్, మంకడ్చువాన్, సలేకాన, దిమిరిముండా ప్రాంతాల్లో బంగారం అన్వేషణ కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో ప్రాథమిక సర్వేలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి.
ఆర్థిక రంగానికి ఊతం
ఈ బంగారం నిధులను వాణిజ్యపరంగా వినియోగించేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేవ్‌గఢ్‌లో తొలిసారిగా బంగారు మైనింగ్ బ్లాక్ వేలం పాటను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇది ఒడిశా ఖనిజ రంగానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది.
అన్వేషణ ప్రక్రియ
ఈ అన్వేషణ ప్రక్రియను ఒడిశా ప్రభుత్వం, జీఎస్‌ఐ, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తున్నాయి. తుది అన్వేషణ నివేదికలను సాంకేతిక కమిటీలు సమీక్షించనున్నాయి. మిగతా జిల్లాల్లో ప్రాథమిక సర్వేలు మంచి ఫలితాలు ఇవ్వొచ్చని, తుది నివేదికలు 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.