దండయాత్ర: ముఖేష్ అంబానీ ఎంట్రీ ఇస్తున్నాడు

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 05:02 AM IST
దండయాత్ర: ముఖేష్ అంబానీ ఎంట్రీ ఇస్తున్నాడు

జియోతో టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన ప్రముఖ బిలియనీర్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంపై దండయాత్రకు సిద్ధమౌతున్నారు. ఈ-కామర్స్ బిజినెస్‌లో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 

టెలికంలో జియోని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు అనుసరించిన వ్యూహాన్నే ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ రంగంలోనూ అమలు చేయనున్నారు. అదే ఉచిత సేవలు. రిలయన్స్ జియో.. ఫ్రీ డేటా, ఫ్రీ అపరిమిత కాల్స్‌తో టెలికం విభాగంలో ప్రత్యర్థుల నుంచి మార్కెట్ వాటాను లాగేసుకున్న విషయం తెలిసిందే. 

ఉచితం ఉంటే చాలు భారతీయ కస్టమర్లు అటువైపు ఆకర్షితులౌతారు. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ విభాగంలోనూ ప్రయోగించనున్నారు. ముకేశ్ అంబానీ దీపావళి కల్లా కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించే అవకాశముంది. దీని ద్వారా దేశంలో రిటైల్ విభాగానికి కొత్త నిర్వచనం చెప్పాలని చూస్తున్నారు. 

కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా పేదోళ్ల నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ అదిరిపోయే షాపింగ్ అనుభూతిని కలిగించాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నారు. అలాగే కస్టమర్లకు దీపావళీ సమయంలో భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉండొచ్చు. ఈ-కామర్స్ విభాగంలో దూసుకెళ్లేందుకు జియో గిగా ఫైబార్, రిలయన్స్ రిటైల్ సాయం తీసుకోనున్నారు ముకేశ్ అంబానీ. వీటి ద్వారా ఈ-కామర్స్ సామ్రాజ్యాన్ని ఏలాలని చూస్తున్నారు.