ఒకే ఒక్కడు, ప్రపంచంలో 5వ అత్యంత ధనవంతుడిగా భారతీయుడు

  • Publish Date - July 23, 2020 / 08:54 AM IST

దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా అపర కుబేరుడు. ఆర్థిక వ్యవస్థను శాసించల సత్తా ఉన్న బిజినెస్ టైకూన్. పరిచయం కూడా అవసరం లేని వ్యాపార దిగ్గజం. ఆయన మరెవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. ముకేశ్ అంబానీ అదరగొట్టారు. మళ్లీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో మరో మూడు మెట్లు పైకి ఎక్కారు.

ప్రపంచ కుబేరుల జాబితాలో 5వ స్థానం:
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో టాప్ 5కి ఎదిగారు ముకేశ్ అంబానీ. ఇప్పుడు ఆయన వరల్డ్ లోనే 5వ అత్యంత సంపన్నుడు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌ ప్రకారం.. ముకేష్ మొత్తం ఆస్తుల విలువ 74.7 బిలియన్ డాలర్లు(రూ.5.572లక్షల కోట్లు)గా ఉంది. అత్యంత సంపన్నుల జాబితాలో జెఫ్ బెజోస్(Amazon CEO), బిల్ గేట్స్(Microsoft Founder), బెర్నార్డ్ ఆర్నాల్ట్(Louis Vuitton SE Chairperson), మార్క్ జుకర్ బర్గ్(Facebook CEO) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. జియోలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో రిలయన్స్ షేర్ విలువ మొదటిసారి రూ.2వేలు దాటింది.

ముకేశ్ కన్నా అత్యంత సంపన్నులు ఆ నలుగురు:
రియల్ టైమ్ లిస్ట్ ఆఫ్ బిలియనీర్స్ పేరుతో అమెరికా బేస్డ్ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ వరల్డ్ టాప్ 5 సంపన్నుల జాబితాను విడుదల చేసింది. సంపద
విషయంలో బెర్క్ షైర్ హాత్ వే సీఈవో, ఇన్వెస్ట్ మెంట్ గురు వారెన్ బఫెట్ ను, టెస్లా మరియు స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ లను ముకేష్ అంబానీ
వెనక్కి నెట్టేశారు.
* అమెజాన్ చీఫ్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతడు. ఆయన టాప్ 1లో ఉన్నారు. ఆయన సంపద విలువ 185.8 బిలియన్
డాలర్లు(రూ.13.8 లక్షల కోట్లు).
* మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 113.1 బిలియన్ డాలర్లు(రూ.8.43 లక్షల కోట్లు).
* Louis Vuitton SE Chairperson బెర్నార్డ్ ఆర్నాల్డ్ మూడో ప్లేస్ లో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 112 బిలియన్ డాలర్లు(రూ.8.38లక్షల కోట్లు).
* ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 89 బిలియన్
డాలర్లు(రూ.6.66లక్షల కోట్లు)

2020 బాగా కలిసొచ్చింది:
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి 2020 ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. అంబానీ సంపద భారీగా పెరుగుతూ వచ్చింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు పరుగులు పెట్టడంతో సంపద విలువ భారీగా పెరిగింది. మార్చి నెల నుంచి చూస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రెట్టింపు కావడం గమనార్హం. ఫేస్‌బుక్ సహా పలు కంపెనీలు రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయడం ఇందుకు కారణం. అంబానీ తన డిజిటల్ వ్యాపారం కోసం ప్రధానంగా రిలయన్స్ యొక్క జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టాడు. భారీ ఒప్పందాలను చేసుకున్నాడు. మార్చిలో
కనిష్ట స్థాయిని తాకినప్పటి నుండి షేర్లు రెట్టింపు అయ్యాయి.

అప్పుల్లేవ్.. రుణరహిత కంపెనీగా రిలయన్స్:
వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ అప్పులు లేని సంస్థగా అవతరించి మరో కీలక మైలురాయిని అధిగమించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రుణ రహిత కంపెనీగా అవతరించిందని ఇటీవలే(జూన్ 20,2020) కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను అప్పులు లేని కంపెనీగా తీర్చిదిద్దుతానన్న వాగ్దానాన్ని 9నెలల ముందుగానే సాధించగలిగామని అన్నారు. రికార్డు స్థాయిలో, కేవలం రెండు నెలల్లో రూ.1.69 లక్షల కోట్ల నిధులు సమీకరించడం ద్వారా రిలయన్స్‌ ఈ టార్గెట్‌ను చేరుకుంది. రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి ఇటీవల భారీగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 25 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1.15 లక్షల కోట్లు, భారత్‌లో అతిపెద్ద రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు సేకరించిందీ కంపెనీ. ఇకపోతే ఇటీవలే ప్రపంచంలోనే ఎనిమిదో అత్యంత ధనవంతుడిగా ఉన్న ముకేశ్ అంబానీ కొద్ది రోజుల వ్యవధిలోనే టాప్ 5లోకి రావడం విశేషం. ఆసియా నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్కడు అంబానీ.

ట్రెండింగ్ వార్తలు