శుభవార్త చెప్పిన ఆర్బీఐ : 24 గంటలూ నెఫ్ట్ సేవలు

  • Publish Date - December 16, 2019 / 11:44 AM IST

ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసే బ్యాంక్  ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) ద్వారా నగదు పంపేందుకు సమయంతో నిమిత్తం లేకుండా  24 గంటల్లో ఎప్పుడైనా పంపించుకునే వెసులు బాటు కల్పించింది. 

డిసెంబర్ 16 నుంచి నెఫ్ట్ సేవలు 24 గంటలూ.. 365 రోజులూ నిరంతరాయంగా అందుబాటులోకి వచ్చాయి. ఇంతకాలం ఉదయం 8గంటలనుంచి సాయంత్రం 6.30 గంటల వరకే నెఫ్ట్ ద్వారా నగదు బదిలీకి అవకాశముండేది. కొత్త సౌకర్యం వల్ల  లావాదేవీలు వీలైనంత త్వరగా సెటిలవుతాయని, ఒకవేళ కాకపోతే..2 గంటల్లో రిటర్న్ అవుతాయని ఆర్బీఐ వెల్లడించింది.
 
ఇప్పుడు ఆర్బీఐ ఈ పరిమిత విధానానికి స్వస్తి పలికింది. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో కూడా నెఫ్ట్ ద్వారా నగదును ఏ క్షణమైనా బదిలీ చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ఆర్బీఐ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలిసింది.

ఇప్పటికే నెఫ్ట్, ఆర్టీజీఎస్ విధానాల్లో జరిగే నగదు బదిలీలపై చార్జీలను ఆర్బీఐ ఎత్తివేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ పద్ధతుల ద్వారా జరిపే లావాదేవీలపై ఛార్జీలు ఎత్తేయాలని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.