Image for representation
Royal Enfield Bullet 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 బైక్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆ కంపెనీ సిద్ధమైంది. శుక్రవారం భారత మార్కెట్లోకి ఈ 2023 అప్‌డేటెడ్ బైక్‌ను తీసుకురానుంది. బైకుల మోడళ్లలో మార్పును కోరుకునే కస్టమర్ల కోసం ఈ సరికొత్త బైకును రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకొస్తుంది.
ఇప్పటికే మార్కెట్లో 350 సీసీతో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, క్లాసిక్ 350 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 బైక్‌ను తీసుకొస్తుంది. ఈ కొత్త మోడల్ బైక్ కూడా ఇంతకుముందు ఉన్న యూసీఈ (యూనిట్ కన్‌స్ట్రక్షన్ ఇంజన్) మోడల్‌కు రిప్లేస్‌మెంట్‌గా రానుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ జే-ప్లాట్‌ఫాం ఇంజిన్‌నే న్యూ జనరేషన్ బుల్లెట్ 350లో వాడారు. క్లాసిక్ రీబార్న్, మీటీయా 350, హంటర్ 350 కూడా జే-ప్లాట్‌ఫాంలో భాగంగానే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 350 సీసీ మోటార్‌సైకిళ్లలో వాడుతున్న ఇంజిన్‌ను పునరుద్ధరిస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 బైక్‌ను తీసుకొస్తున్నారు.
అయినప్పటికీ ఈ కొత్త బైక్ అనేక ప్రత్యేకతలతో విడుదల కానుంది. దీనిలోని ఇంజిన్ పవర్ గరిష్ఠంగా 20 బీహెచ్‌పీ సామర్థ్యంతో ఉంటుంది. గరిష్ఠ టార్క్ 27 ఎన్ఎమ్. 5-స్పీడ్ గేర్ బాక్స్, నూతన స్విచ్ గేర్ తో పాటు అడ్వాన్స్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటాయి. ఫీచర్లలో యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంటుంది.
ప్రస్తుతం బుల్లెట్ 350 బైకుల ధరలు రూ.1.60 లక్షల నుంచి రూ.1.69 లక్షల మధ్య ఉన్నాయి. 350 సీసీ బైకుల్లో ప్రస్తుతం హంటర్ 350 అన్నింటికన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్‌గా ఉంది. దాని ఎక్స్ షోరూమ్ ధర 1.5 లక్షల రూపాయలుగా ఉంది. శుక్రవారం విడుదల కానున్న న్యూ జనరేషన్ బుల్లెట్ 350 ధర రూ.1.70 లక్షలుగా ఉండనున్నట్లు అంచనా.