Budvel: నూతన హైకోర్టు ప్రతిపాదనలతో బుద్వేల్‌లో రియల్టీకి జోష్‌

హైకోర్టు నిర్మాణంతో బుద్వేల్‌లో మౌలిక సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో డెవలప్‌ అయ్యే అవకాశముంది.

new high court proposal rise real estate development in budvel

Real estate development in budvel: మౌలిక వసతుల కల్పన పెరిగితే అందుకు తగ్గట్టుగా అభివృద్ధిలో మార్పులు వస్తాయి. సౌత్ జోన్ పరిధిలోని రాజేంద్ర నగర్ సర్కిల్‌లో హైకోర్టు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త హైకోర్టు కోసం వంద ఎకరాల భూములను సర్కార్‌ కేటాయించింది. అనేక వసతులతో రాష్ట్ర హైకోర్టు నిర్మాణం జరగనుంది. ఇక రెండో దశలో మెట్రో రైల్‌ను విస్తరించాలని నిర్ణయించిన బుద్వేల్‌లో హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతానికి కనెక్టివిటి ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌కు బుద్వేల్‌ అతి సమీపంలో ఉంది. దీనికి తోడు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఉండటం బుద్వేల్‌, రాజేంద్రనగర్‌లకు కలిసొచ్చే అంశం. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త హైకోర్టు సమీపంలోనే నిర్మాణం కానుంది. ఇలా అనేక అంశాలు కలిసిరావడంతో రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని వివిధ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు రియల్టీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రియల్టీ రంగానికి మంచి డిమాండ్‌ ఏర్పడింది.

వెస్ట్‌జోన్‌లో డెవలప్‌మెంట్‌
విశ్వనగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో అభివృద్ధి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 2000 సంవత్సరం వరకు ఓ సాధారణ ఏరియాగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు.. ఐటీ ఆధారిత సంస్థల ఏర్పాటుతో అక్కడ ఒక్కసారిగా స్వరూపమే మారిపోయింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడంతో వెస్ట్‌జోన్‌లో డెవలప్‌మెంట్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. అనతికాలంలోనే పెద్ద పెద్ద నిర్మాణాలు.. భారీ నివాస సముదాయాలు వెలిశాయి. ఇప్పుడు శంషాబాద్‌కు అతి సమీపంలో ఉన్న రాజేంద్ర నగర్ బుద్వేల్‌లో 100 ఎకరాల్లో కోర్టు సముదాయం పూర్తయితే ఆయా పరిసర ప్రాంతాల్లోనూ డెవలప్‌మెంట్‌ యాక్టివిటీ భారీగా పెరగనుంది.

Also Read: తెలంగాణలో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్.. ఏపీతో పోలిస్తే రెట్టింపు ప్రాజెక్టులు

హైకోర్టు నిర్మాణంతో బుద్వేల్‌లో మౌలిక సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో డెవలప్‌ అయ్యే అవకాశముంది. డిమాండ్‌కు అనుగుణంగా అనేక కొత్త నివాస ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఫైవ్‌ స్టార్‌ హోటల్స్, మాల్స్ కూడా ఆ ప్రాంతానికి వస్తాయి. ఇలా నివాస, వాణిజ్య కార్యకలాపాల కోసం చాలా స్పెస్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. దీంతో సౌత్‌జోన్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో రియల్టీ బిజినెస్‌ మరింతగా పెరిగే అవకాశముంది.