Hyderabad: దేశం మొత్తం చూపు హైదరాబాద్‌ రియాల్టీ వైపే.. ఇప్పటికీ అందుబాటులోనే ఇళ్ల ధరలు

ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, అహ్మదాబాద్, కోల్ కత్తాతో పోలిస్తే హైదరాబాద్‌ లోనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి.

New josh in Hyderabad real estate market

Hyderabad real estate : భారత రియల్ ఎస్టేట్ రంగం చూపంతా ఇప్పుడు హైదరాబాద్‌ రియల్టీపై పడింది. గ్రేటర్ సిటీలోని భూముల ధరలు చూసి దేశీయ రియల్ సంస్థలన్నీఆశ్చర్యపోతున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న వేలంలో భూములధరలు రికార్టులను సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన కోకాపేట్ భూముల వేలంలో ఎకరం గరిష్టంగా వంద కోట్ల 75 లక్షల రూపాయల ధర పలకడం ఆల్ టైం రికార్డని చెప్పవచ్చు. ఆ తరువాత మోకిలాలో హెచ్ఎండీఏ భూముల వేలంలో గజం లక్షా 5వేల రూపాయలు పలికింది. ఇక తాజాగా బుద్వేల్‌ భూముల వేలంలో ఎకరం ధర అత్యధికంగా 41 కోట్ల 25 లక్షల రూపాయలు పలికింది. ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడం, అందులోనూ దిగ్గజ నిర్మాణ సంస్థలు పోటీ పడీమరి కొనుక్కోవడంతో హైదరాబాద్‌ రియల్ బ్రాండ్ సత్తా మరోసారి దేశంమంతా తెలిసింది. దేశంలో ఏ నగరంలో లేనివిధంగా రికార్డుస్థాయిలో ఇక్కడ భూముల ధరలు పలకడానికి చాలా కారణాలున్నాయని అంటున్నారు రియల్ రంగ నిపుణులు. అందులో హైదరాబాద్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న వాళ్లే కాదు, ఎన్ఆర్ఐలు సైతం ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇక హైదరాబాద్‌లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఐటీ, ఫార్మా కంపెనీలు ఇక్కడ ఏర్పాటవుతుండటం, బ్యాంకింగ్, ఆర్థిక రంగకార్యకలాపాలు పెరగడం, పారిశ్రామికీకరణ వేగంగా జరగడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్‌కు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డు, ట్రాఫిక్ చిక్కులు లేని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, నగరంలో ఇప్పుడున్న మెట్రోకు తోడు మలి దశలో రాబోతున్న భారీ మెట్రో ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు, రింగ్ రైల్.. ఇలా చెప్పుకుంటు పోతే చాలా ఉన్నాయి. వీటన్నింటికీ తోడు పొలిటికల్ స్టెబిలిటీ కారణంగా శాంతియుతమైన జీవనం హైదరాబాద్‌ సొంతం. విద్యా, ఉద్యోగ, ఉపాధి, వైద్య రంగాలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, రీక్రియేషన్ రంగాల్లోను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సదుపాయాలుండటం భాగ్యనగరం ప్లస్ పాయింట్.

Also Read: రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఇళ్లకు భారీ డిమాండ్.. ఎందుకో తెలుసా!

ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇళ్లకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా దేశంలోని మిగతా రాష్ట్రాల వారు, ఎన్ఆర్ఐలు సైతం భాగ్యనగరంలో సొంత ఇల్లు లేదంటే నివాస స్థలం ఉండాలనికోరుకుంటున్నారు. దీంతో నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో నిర్మాణరంగ పరిధి పెరుగుతోంది. పదేళ్ల క్రితం వరకు యేడాదికి 10 వేల ఇళ్ల అమ్మకాల భాగ్యనగర మార్కెట్ క్రమంలో పెరుగుతూ 2020 నాటికి సంవత్సరానికి 25 వేలగృహాల సేల్స్ వరకు పెరిగింది. 2025 నాటికి యేడాదికి 50 వేల ఇళ్ల అమ్మకాలకు హైదరాబాద్‌ రియల్ మార్కెట్ చేరుకుంటుందని రియల్ రంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. ఇటువంటి అంశాలన్నీ హైదరాబాద్‌ భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికే విధంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: హైదరాబాద్ మెట్రో విస్తరణతో అందుబాటు ధరల్లో ఇళ్లు.. అదెలాగంటే!

మరోవైపు హైదరాబాద్‌లో ఎకరం వంద కోట్ల రూపాయల మేర భూముల ధరలు పలికితే ఆ ప్రభావం ఇళ్ల ధరలపై పడుతుంది. తద్వారా గృహాల ధరలు పెరిగి, సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే హైదరాబాద్‌లో ఐటీ హబ్ పరిసర ప్రాంతాల్లోనే భూములకు భారీ ధరలు పలుకుతుండగా, శివారు ప్రాంతాల్లోని భూములు అందుబాటులోనే ఉన్నాయి. ఇక దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ భాగ్యనగర శివారుప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ చదరపు అడుగు 3 వేల 800 రూపాయలకు లభిస్తోంది. అంటే వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం గల డబుల్ బెడ్రూమ్‌ ఫ్లాట్ 40 లక్షల నుంచి 45 లక్షల రూపాయల మధ్య అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో సగటున చదరపు అడుగు ఇంటి ధర 5వేల 200 రూపాయలుగా ఉంది. అంటే సిటీకి కాస్త దూరంలో మీడియం రేంజ్ ఫ్లాట్ కొనాలనుకుంటే 60 లక్షల నుంచి 80 లక్షల రూపాయల మధ్య లభిస్తోంది. ఇక ప్రీమియం అండ్ లగ్జరీ అపార్ట్ మెంట్స్, విల్లాలైతే కోటి రూపాయల నుంచి మొదలు 25కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి.

Also Read: వృద్ధి బాటలో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్.. ఐదు రెట్లు పెరిగిన సేల్స్‌

మొత్తానికి దేశంలోని మిగతా ఏడు మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, అహ్మదాబాద్, కోల్ కత్తాతో పోలిస్తే హైదరాబాద్‌ లోనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇళ్ల ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే హైదరాబాద్‌ లో స్థిర నివాసం ఎర్పాటు చేసుకోవాలనుకునేవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇల్లు లేదంటే ఇంటి స్థలం కొనుక్కోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు